సొంత పార్టీ నేతలపైనే ఎంపీ పిల్లి సుభాష్ అవినీతి ఆరోపణలు

  • రామచంద్రపురం మెప్మా నిధులు రూ.1.22 కోట్లు స్వాహా అయ్యాయన్న పిల్లి సుభాష్ 
  • వైసీపీ పాలనలో నేతలు, అధికారులు కుమ్మక్కై నిధులు దోచేశారని ఆరోపణ
  • పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్లతో కలిసి నిధులు స్వాహా చేశారని వెల్లడి
  • కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత పార్టీపైనే చేసిన అవినీతి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీకి చెందిన రూ.1.22 కోట్ల మెప్మా నిధులను అప్పటి అధికార పార్టీ నేతలు, పురపాలక కమిషనర్, గుత్తేదార్లు కలిసి దోచుకున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను ఆయన బయటపెట్టారు.

పేదరిక నిర్మూలనకు కేటాయించిన మెప్మా నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని బోస్ ఆరోపించారు. గత ప్రభుత్వం రామచంద్రపురంలోని కొందరు పేదలకు వెల్ల, వెల్లసావరం, ఉండూరు, హసనబాద గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించిందని, అక్కడ ఇళ్ల నిర్మాణం కోసం అప్పటి మున్సిపల్ కమిషనర్ మెప్మా నిధులను మళ్లించారని వివరించారు. అయితే ఇళ్లు నిర్మించకుండా, నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్లతో కలిసి నిర్మాణ సామగ్రిని స్వాహా చేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

ఈ అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్థిక మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. ఈ కుంభకోణం కారణంగా బదిలీపై వెళ్లిన ఓ ఉద్యోగి తన సొంత జేబు నుంచి రూ.40 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News