India Economy: రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!

India to be 3rd Largest Economy by 2028 SBI Report
  • 2030 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా అవతరణ
  • తలసరి ఆదాయం 4000 డాలర్ల మార్కును చేరనుందని అంచనా
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదికలో వెల్లడి
  • 2028 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది. రాబోయే రెండేళ్లలో, అంటే 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా, 2030 నాటికి భారత్ 'ఎగువ మధ్య ఆదాయ' దేశంగా మారుతుందని అంచనా వేసింది.

ప్రస్తుతం 'దిగువ మధ్య ఆదాయ' దేశాల జాబితాలో ఉన్న భారత్, 2030 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశాల కేటగిరీలోకి చేరుతుందని నివేదిక పేర్కొంది. ఆ సమయానికి తలసరి ఆదాయం 4000 డాలర్ల (సుమారు రూ.3.30 లక్షలు) మార్కును అందుకోవచ్చని తెలిపింది. ఈ మార్పుతో చైనా, ఇండోనేషియా వంటి దేశాల సరసన భారత్ నిలుస్తుందని ఎస్‌బీఐ విశ్లేషించింది. "భారత్ మరో నాలుగేళ్లలో, అంటే 2030 నాటికి తలసరి ఆదాయంలో 4000 డాలర్లకు చేరి ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారనుంది" అని నివేదికలో పేర్కొంది.

ఆర్థిక వృద్ధిలో కీలక మైలురాళ్లను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. సుమారు రెండేళ్లలో, అంటే 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అలాగే, 2035-36 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం, ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారాలంటే తలసరి స్థూల జాతీయ ఆదాయం (GNI) సుమారు 4,500 డాలర్లు ఉండాలి. భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకోగలదని నివేదిక ధీమా వ్యక్తం చేసింది.
India Economy
Indian Economy
SBI Report
Economic Growth
GDP
5 Trillion Economy
10 Trillion Economy
Per Capita Income
Indian Economic Growth
World Economy

More Telugu News