విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు

  • జ్యూరిచ్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
  • రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ
  • ఎన్నికల విజయంలో ఎన్నార్టీలు, జనసేన, బీజేపీల పాత్ర కీలకమని వెల్లడి
  • టెక్నాలజీ, యువతకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ
  • ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, ఏఎం గ్రీన్ వంటి భారీ పెట్టుబడులు సాధించామని వెల్లడి
స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యూరిచ్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ప్రభావం చూపగల కమ్యూనిటీగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ఒకప్పుడు నేను దావోస్‌కు వచ్చినప్పుడు భారతీయులే తక్కువగా ఉండేవారు, తెలుగువారు అసలు కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ 20 దేశాల నుంచి వచ్చిన తెలుగువారిని చూస్తుంటే విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అనేంత సంతోషంగా ఉంది" అని అన్నారు. విదేశాల్లో ఉన్నా మన సంప్రదాయాలను పాటిస్తున్నారని, కోడిపందాలు తప్ప సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారని ప్రశంసించారు. తాను గతంలో విజన్ 2020, ఐటీ గురించి మాట్లాడినప్పుడు విమర్శలు వచ్చాయని, కానీ ఆనాటి నిర్ణయాల వల్లే నేడు తెలుగువారు 195 దేశాలకు వెళ్లగలిగారని గుర్తుచేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీల పాత్ర అద్భుతమని కొనియాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే సదుద్దేశంతో పవన్ కల్యాణ్, బీజేపీ కలిసి వచ్చాయని తెలిపారు. "రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరగానే, ఎన్నార్టీలు ఆలోచించకుండా తరలివచ్చి కూటమి కోసం పనిచేశారు. కొందరు కార్యకర్తలతో సమానంగా కేసులు కూడా ఎదుర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, మీ అందరి సహకారంతో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుత విజయం సాధించాం," అని చంద్రబాబు వివరించారు.

విధ్వంసమైన రాష్ట్రాన్ని 18 నెలల కాలంలోనే తిరిగి గాడిన పెట్టామని, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో బ్రాండ్‌ను పునరుద్ధరించామని చెప్పారు. అభివృద్ధి విషయంలో మంత్రులతో తాను పోటీ పడుతూ పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించామన్నారు. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1 లక్ష కోట్లతో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తోందని, ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్లతో కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి గూగుల్ రూపంలో ఏపీకే వచ్చిందన్నారు.

యువతను ప్రోత్సహించడంలో భాగంగానే లోకేష్, రామ్మోహన్‌నాయుడు, టీజీ భరత్ వంటి వారికి పదవులు ఇచ్చామని తెలిపారు. రామ్మోహన్‌నాయుడు కేంద్రంలోనే అత్యంత పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రి కావడం గర్వకారణమన్నారు. "పదవులు వస్తే గ్లామరే కాదు, రాళ్లు కూడా పడతాయి. సవాళ్లను ఎదుర్కోవడం యువత నేర్చుకోవాలి" అని హితవు పలికారు. 

టెక్నాలజీ ప్రాధాన్యతను వివరిస్తూ లైచెన్ స్టెయిన్ అనే చిన్న దేశం టెక్నాలజీతోనే సంపన్న దేశంగా మారిందని, అందుకే తాము కూడా క్వాంటం, ఏఐ, స్పేస్, డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామని తెలిపారు. డ్రోన్ ఆపరేషన్లకు అనుమతులు వేగవంతం చేసే బాధ్యతను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తీసుకోవాలని కోరారు. ఎలక్ట్రానిక్స్, హెల్త్ డివైసెస్, ఫార్మా, ప్రకృతి సేద్యం, నీటి భద్రత వంటి రంగాలపై దృష్టి సారించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.


More Telugu News