చ‌రిత్ర సృష్టించిన కోహ్లీ.. కివీస్‌పై సెంచరీతో అరుదైన రికార్డు న‌మోదు

  • న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో సెంచరీ చేసిన విరాట్ 
  • కివీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు
  • పాంటింగ్, సెహ్వాగ్‌లను అధిగమించి అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీ
  • అన్ని ఫార్మాట్లలో కలిపి కూడా కివీస్‌పై అత్యధిక సెంచరీలు (10) విరాట్‌వే
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన శతకంతో చెలరేగాడు. అయితే, కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసినా ఈ మ్యాచ్‌లో భారత్‌కు 41 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో సెంచరీ బాదాడు. వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై కోహ్లీకి ఇది 7వ సెంచరీ. ఈ ఘనతతో కివీస్‌పై అత్యధిక వన్డే శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (చెరో 6 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య (చెరో 5 సెంచరీలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అలాగే, అన్ని ఫార్మాట్లలో కలిపి కూడా కివీస్‌పై అత్యధిక సెంచరీలు (10) సాధించిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. జాక్వెస్ కలిస్, జో రూట్, స‌చిన్ చెరో 9 శ‌త‌కాలతో అతని త‌ర్వాతి స్థానంలో ఉన్నారు. 

న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు (వ‌న్డేలు)
7 - విరాట్ కోహ్లీ (36 ఇన్నింగ్సులు)
6 - రికీ పాంటింగ్ (50 ఇన్నింగ్సులు)
6 - వీరేంద్ర సెహ్వాగ్ (23 ఇన్నింగ్సులు)
5 - సచిన్ టెండూల్కర్ (41 ఇన్నింగ్సులు)
5 - సనత్ జయసూర్య (45 ఇన్నింగ్సులు)


కివీస్‌పై అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో)
10 - విరాట్ కోహ్లీ (73 ఇన్నింగ్సులు)
9 - జాక్వెస్ కలిస్ (76 ఇన్నింగ్సులు)
9 - జో రూట్ (71 ఇన్నింగ్సులు)
9 - సచిన్ టెండూల్కర్ (80 ఇన్నింగ్సులు)


More Telugu News