ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా.. దావోస్‌కు సీఎం చంద్రబాబు

  • సీఎంతో పాటు మంత్రులు లోకేశ్, టీజీ భరత్, ఉన్నతాధికారులు
  • జ్యూరిచ్‌లో ప్రవాస తెలుగువారి సమావేశంలో పాల్గొననున్న సీఎం
  • తొలిరోజే యూఏఈ మంత్రి, టాటా సన్స్ చైర్మన్‌తో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఆదివారం రాత్రి ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఉన్నతాధికారుల బృందం ఉంది. ప్రపంచ ఆర్ధిక సదస్సు (WEF)లో ఈ బృందం పాల్గొననుంది.

జ్యూరిచ్ చేరుకున్న అనంతరం అక్కడ తొలుత స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో, అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా బృందంతో సమావేశమవుతారు. ఆ తర్వాత భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.

జ్యూరిచ్ కార్యక్రమాల అనంతరం సీఎం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. పర్యటన తొలిరోజే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో చంద్రబాబు భేటీ అవుతారు.

నేటి నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం 36 సమావేశాల్లో పాల్గొంటారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఏపీకి ఉన్న అవకాశాలను ప్రపంచ వేదికపై వివరించి, పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. పర్యటన ముగించుకుని ఈ నెల 23న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.


More Telugu News