గాజా శాంతి సంఘంలోకి భారత్‌కు ట్రంప్ ఆహ్వానం!

  • గాజాలో పాలన, పునర్నిర్మాణ ప్రక్రియలను పర్యవేక్షించేందుకు ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటు చేసిన ట్రంప్
  • గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు ట్రంప్ నుంచి తమకూ ఆహ్వానం అందిందన్న పాకిస్థాన్
  • పాకిస్థాన్ ఎలాంటి పాత్ర పోషించినా అది తమకు ఆమోదయోగ్యం కాదన్న ఇజ్రాయిల్‌
ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రాంతంలో పాలన, పునర్నిర్మాణ ప్రక్రియలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో భాగస్వాములు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. జనవరి 15న ప్రకటించిన 20 అంశాల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా ఈ బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ బోర్డుకు ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహిస్తుండగా, గాజా పాలన బాధ్యతలను పాలస్తీనా టెక్నోక్రాట్ కమిటీ నిర్వహించనుంది. పాలసీ సూచనలు, సలహాలు అందించేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డు కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

భారతదేశానికి ఇజ్రాయిల్, పాలస్తీనా రెండింటితోనూ స్నేహ సంబంధాలు ఉండటం, ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుండటం ఈ ఆహ్వానానికి ప్రాధాన్యం చేకూరుస్తున్నాయి. గాజా యుద్ధం తరువాత మానవతా సహాయం పంపిన తొలి దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది.

ఇదే సమయంలో గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు తమకు కూడా ట్రంప్ నుంచి ఆహ్వానం అందిందని పాకిస్థాన్ ప్రకటించింది. అయితే, భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, గాజా భవిష్యత్తు విషయంలో పాకిస్థాన్ ఎలాంటి పాత్ర పోషించినా అది ఇజ్రాయిల్‌కు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రతిపాదనపై ప్రపంచ దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. సుమారు 60 దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తుండగా, ఇప్పటివరకు హంగేరి మాత్రమే ఈ బోర్డులో చేరేందుకు అంగీకరించింది. ఈ బోర్డు ఏర్పాటు ఐక్యరాజ్యసమితి పాత్రకు భంగం కలిగించవచ్చని ఐరోపా దేశాల దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డులో టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, ఐక్యరాజ్యసమితి మధ్యప్రాచ్య శాంతి సమన్వయకర్త సిగ్రిడ్ కాంగ్, యూఏఈ మంత్రి రీమ్ అల్ హషిమీ, ఖతార్, యూఏఈకి చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. అలాగే ఇజ్రాయిల్-సైప్రస్ వ్యాపారవేత్త యాకిర్ గాబే కూడా బోర్డులో చోటు దక్కించుకున్నారు.

అయితే బోర్డు కూర్పుపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. టర్కీ, ఖతార్ ప్రతినిధులు ఉండటాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. 


More Telugu News