Chandrababu Naidu: ఆయన బెంగళూరులో ఉంటే అదే రాజధాని అవుతుందా?: సీఎం చంద్రబాబు

Chandrababu Slams Jagan on Capital Issue
  • ఎన్టీఆర్ 30వ వర్థంతి సభలో నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
  • ఎన్టీఆర్ సంక్షేమ బాటలోనే కూటమి ప్రభుత్వం పయనిస్తోందని వెల్లడి
  • ఏపీ రాజధాని అమరావతే అని ఉద్ఘాటన
  • గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు, 'క్రెడిట్ చోరీ' ఆరోపణల ఖండన
  • 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం
  • రాష్ట్రంలో రౌడీయిజం, అరాచకాలను ఉపేక్షించబోమని హెచ్చరిక
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందా? మరి ఆయన (జగన్) ఎక్కువగా బెంగళూరులో ఉండేవారు, అటువంటప్పుడు దాన్నే రాజధానిగా ప్రకటించాల్సింది అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధాని విషయంలో గత పాలకులు సృష్టించిన గందరగోళానికి ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్థంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఏపీ రాజధాని అమరావతే
రాజధానిపై ఐదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడిందని చంద్రబాబు స్పష్టం చేశారు. "గత ఐదేళ్లుగా మన రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో బతికాం. మూడు రాజధానులంటూ గందరగోళం సృష్టించారు. కానీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు రాజధానుల నినాదం ఎక్కడైతే బలంగా వినిపించారో, అక్కడి ప్రజలు కూడా ఎన్డీయే అభ్యర్థులనే గెలిపించారు. ఇకపై ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఎవరైనా ఏపీ రాజధాని ఏది అని అడిగితే, మనమంతా గర్వంగా, కాలర్ ఎగరేసి ‘అమరావతి’ అని చెప్పుకుందాం. ఇది మనందరి రాజధాని, ప్రజా రాజధాని, దేవతల రాజధాని" అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

యుగపురుషుడికి నివాళి
ఎన్టీఆర్ తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఏకైక నాయకుడని చంద్రబాబు కొనియాడారు. "ఎన్టీఆర్ మనకు భౌతికంగా దూరమై 30 ఏళ్లు గడిచినా, ఆయన స్ఫూర్తి మనతోనే ఉంది. ఒకప్పుడు మదరాసీలుగా పిలవబడిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆయన ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్లారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన యుగపురుషుడు ఆయన. విద్యావంతులను, మేధావులను రాజకీయాల్లోకి ఆహ్వానించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు" అని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

ఎన్టీఆర్ బాటలోనే సంక్షేమం
ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని చంద్రబాబు తెలిపారు. "ఆనాడు ఆయన రూ.2కే కిలో బియ్యం ఇచ్చి దేశంలో ఆహార భద్రతకు నాంది పలికారు. నేడు మేము అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ఆయన రూ.35తో ప్రారంభించిన పింఛనును ఇప్పుడు రూ.4 వేలకు పెంచి గౌరవంగా అందిస్తున్నాం. ఆయన చూపిన బాటలోనే పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇటీవల 3 లక్షల గృహ ప్రవేశాలు చేయించాం, ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తాం" అని వివరించారు.

భూ హక్కులకు తిరుగులేని భరోసా
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. నాడు ఎన్టీఆర్ భూ రికార్డుల్లో పారదర్శకత కోసం మునసబు, కరణం వ్యవస్థను రద్దు చేస్తే, గత పాలకులు కొత్త అధికారులను సృష్టించి ప్రజల ఆస్తులు కొట్టేయాలని చూశారు. వారి కుట్రలను భగ్నం చేశాం. రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నాం. రీ-సర్వేను పక్కాగా పూర్తిచేసి, బ్లాక్ చైన్, క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయకుండా పటిష్టమైన భద్రత కల్పిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.

అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యం
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. "దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. నిన్ననే కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఇదీ తెలుగువారి సత్తా. కానీ కొందరు దీన్ని కూడా 'క్రెడిట్ చోరీ' అని విమర్శిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం కోసం మేము 2,500 ఎకరాలు సేకరిస్తే, గత ప్రభుత్వం ఐదేళ్లు దాన్ని పక్కన పడేసింది. అమరావతిని స్మశానం అన్నారు. వారి క్రెడిట్ అంతా ఇసుక, మద్యం, మైనింగ్, డ్రగ్స్, గంజాయి మాత్రమే" అని ఆయన విమర్శించారు.

జలయజ్ఞానికి పునరంకితం
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. "ఎన్టీఆర్ హయాంలో తెలుగుగంగ, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు పునాది పడింది. మేము అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని జలకళతో నింపుతాం. ఈ ఏడాదిలోనే వెలుగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తాం. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. శ్రీకాకుళంలోని వంశధార నుంచి నెల్లూరులోని పెన్నా వరకు నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం" అని ప్రకటించారు.

శాంతిభద్రతలపై ఉక్కుపాదం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హెచ్చరించారు. "రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను టీడీపీ అంతం చేసింది. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. ముఖ్యంగా పల్నాడులో గిల్లికజ్జాలు పెట్టుకుని రెచ్చగొడుతున్నారు. ఇలాంటివి మా దగ్గర నడవవు. నా దగ్గర తోక తిప్పలేరు. రాజకీయ ముసుగులో అరాచకాలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే పట్టుకొచ్చి బట్టలూడదీస్తాం. పల్నాడును ప్రక్షాళన చేసి శాంతియుత ప్రాంతంగా మారుస్తాం" అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

కార్యకర్తలే బలం.. కేంద్రంతో సమన్వయం
కోటి మంది కార్యకర్తలున్న టీడీపీకి దేశంలో ఏ పార్టీకి లేనంత బలముందని చంద్రబాబు అన్నారు. "కష్టకాలంలో జై టీడీపీ, జై సీబీఎన్ అని నినదించిన కార్యకర్తలకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. వారిని గౌరవంగా చూసుకునే బాధ్యత నాది" అని భరోసా ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ ఎప్పుడూ కీలక పాత్ర పోషించిందని, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, తాము కూడా కేంద్రానికి అదే స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. "దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుండాలి, తెలుగుజాతి అన్నింటా ముందుండాలన్నదే నా ఆకాంక్ష" అని తన ప్రసంగాన్ని ముగించారు.
Chandrababu Naidu
AP capital Amaravati
Andhra Pradesh
NTR Vardhanthi
Jagan Mohan Reddy
TDP
Polavaram project
Land Titling Act
AP investments
Palanadu

More Telugu News