Grandhi Mallikarjuna Rao: ఆలయానికి రూ. కోటి విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చిన జీఎంఆర్ అధినేత

GMR Mallikarjuna Rao Donates Land Worth 1 Crore to Temple
  • రాజాం వాసవి ఆలయానికి కోటి విలువైన స్థలం విరాళం
  • జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు ఉదారత
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష
  • సంక్రాంతి సందర్భంగా 8 వేల మందికి వస్త్రాల పంపిణీ
  • 40 మంది విద్యార్థులను దత్తత తీసుకున్న జీఎంఆర్ ఫౌండేషన్
ప్రముఖ వ్యాపారవేత్త, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు తన సొంత జిల్లాలో భారీ విరాళం ప్రకటించారు. విజయనగరం జిల్లా రాజాంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి రూ. కోటి విలువైన 19 సెంట్ల స్థలాన్ని వితరణగా అందించారు. శనివారం తన భార్య వరలక్ష్మితో కలిసి ఆలయాన్ని సందర్శించిన ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థలానికి సంబంధించిన దస్తావేజులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ పర్యటనలో భాగంగా జీఎంఆర్ సంస్థ నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పురోగతిని మల్లికార్జునరావు సమీక్షించారు. టెర్మినల్ భవనం, రన్‌వే, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు.

వ్యాపార కార్యకలాపాలతో పాటు జీఎంఆర్ గ్రూప్ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. ప్రతి ఏటా సంక్రాంతికి తన స్వస్థలానికి వచ్చే మల్లికార్జునరావు, ఈసారి కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పండుగ సందర్భంగా సుమారు 8 వేల మందికి రూ. 64 లక్షల విలువైన వస్త్రాలను పంపిణీ చేశారు. దీంతో పాటు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా రాజాం ప్రాంతానికి చెందిన 40 మంది నిరుపేద బాలలను దత్తత తీసుకున్నారు. ఈ విద్యార్థుల చదువుకు అయ్యే పూర్తి ఖర్చును ఫౌండేషన్ భరిస్తుందని ఆయన తెలిపారు.
Grandhi Mallikarjuna Rao
GMR Group
Vasavi Kanyaka Parameswari Temple
Vizianagaram
Rajam
Donation
Bhoga puram International Airport
GMR Varalakshmi Foundation
philanthropy
Andhra Pradesh

More Telugu News