CCL 2026: విశాఖలో అఖిల్ విధ్వంసం.. సెంచరీతో తెలుగు వారియర్స్‌ను గెలిపించిన కెప్టెన్

Akhil Akkineni Century Leads Telugu Warriors to Victory in CCL 2026
  • సీసీఎల్ 2026లో తెలుగు వారియర్స్ బోణీ
  • పంజాబ్ దే షేర్‌పై 52 పరుగుల తేడాతో గెలుపు
  • కెప్టెన్ అక్కినేని అఖిల్ అజేయ సెంచరీ
  • విశాఖలో అభిమానులకు కనుల పండుగ
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026 సీజన్‌ను తెలుగు వారియర్స్ ఘన విజయంతో ఆరంభించింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ విధ్వంసక సెంచరీతో చెలరేగడంతో శనివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్‌పై 52 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అఖిల్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ అఖిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి అశ్విన్‌బాబు (51 బంతుల్లో 60 పరుగులు) చక్కటి సహకారం అందించడంతో జట్టు పటిష్ఠ‌ స్థితికి చేరింది.

అనంతరం 185 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ దే షేర్ జట్టు, తెలుగు వారియర్స్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. కరణ్‌వాణి (56), హర్డీసంధు (28) మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో 18.2 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. తెలుగు బౌలర్లలో వినయ్ మహదేవ్ మూడు వికెట్లతో సత్తా చాటగా, సామ్రాట్ రెండు వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇదే వేదికపై అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టు ముంబయి హీరోస్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో తెలుగు వారియర్స్ పాయింట్ల పట్టికలో శుభారంభం చేయడమే కాకుండా, టోర్నీలో తమ ప్రస్థానాన్ని ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టింది.
CCL 2026
Akhil Akkineni
Telugu Warriors
Celebrity Cricket League
Punjab De Sher
Visakhapatnam
Telugu Cinema
Cricket
Ashwin Babu
Vinay Mahadev

More Telugu News