ఒక్క ఆర్టికల్ రాస్తే రూ.9 కోట్లు.. కంటెంట్ క్రియేటర్లకు మస్క్ బంపరాఫర్

  • ఉత్తమ ఆర్టికల్‌కు 1 మిలియన్ డాలర్లు ప్రకటించిన ఎక్స్
  • క్రియేటర్లు, జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు కొత్త కార్యక్రమం
  • పోటీలో పాల్గొనాలంటే ఆర్టికల్ కనీసం 1000 పదాలు ఉండాలని ష‌ర‌తు
  • ప్రస్తుతానికి ఈ పోటీ కేవలం అమెరికాలోని యూజర్లకు మాత్రమే
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X), కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక భారీ ఆఫర్‌ను ప్రకటించింది. తమ ప్లాట్‌ఫామ్‌లో అత్యుత్తమ ఆర్టికల్ రాసిన వారికి ఏకంగా 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.9.07 కోట్లు) బహుమతిగా ఇవ్వనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. సమాజంలో చర్చను రేకెత్తించే, కొత్త వార్తలను సృష్టించే, సంస్కృతిని ప్రభావితం చేసే కంటెంట్‌ను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. రచయితలు, జర్నలిస్టులు, మేధావులు నాణ్యమైన, సుదీర్ఘమైన ఆర్టికల్స్ రాయడాన్ని ప్రోత్సహించేందుకు ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు 'ఎక్స్' పేర్కొంది.

ఈ 'టాప్ ఆర్టికల్' పోటీ ఈ నెల‌ 16న ప్రారంభమై, 28న ముగుస్తుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు సమర్పించే ఆర్టికల్ కనీసం 1000 పదాల నిడివి కలిగి ఉండాలి. అయితే, ప్రస్తుతానికి ఈ అవకాశం కేవలం అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వెరిఫైడ్ హోమ్ టైమ్‌లైన్‌లో వచ్చిన ఇంప్రెషన్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇటీవల ఎక్స్ తన ప్రీమియం యూజర్లందరికీ సుదీర్ఘమైన ఆర్టికల్స్ ప్రచురించే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే.

కంటెంట్ క్రియేటర్లు రాసే ఆర్టికల్‌పై నిబంధనలివే..
ఈ పోటీకి ఎక్స్ కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. సమర్పించే ఆర్టికల్ పూర్తిగా ఒరిజినల్‌గా ఉండాలి, ఎలాంటి ప్లేజరిజం ఉండకూడదు. ద్వేషపూరిత ప్రసంగాలు, జాత్యహంకారం, వివక్ష, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కంటెంట్ అనర్హం. అసభ్యకరమైన, అవాస్తవ, తప్పుదోవ పట్టించే సమాచారం ఉండకూడదు. ఇతరులను కించపరిచేలా, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయరాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ సహాయంతో రూపొందించిన ఆర్టికల్స్‌ను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఒకసారి సమర్పించిన తర్వాత ఆర్టికల్‌ను సవరించడానికి వీలుండదు. కానీ, ఒక యూజర్ ఎన్ని ఆర్టికల్స్ అయినా సమర్పించవచ్చు.

అదే సమయంలో ఎక్స్, దాని ఏఐ చాట్‌బాట్ గ్రోక్.. మహిళలు, పిల్లలకు సంబంధించిన డీప్‌ఫేక్ చిత్రాల సృష్టి విషయంలో తీవ్ర నియంత్రణ ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఈ చర్య ద్వారా కేవలం మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా, నాణ్యమైన, సుదీర్ఘమైన కంటెంట్‌కు కూడా వేదికగా మారాలని ఎక్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.


More Telugu News