ఎన్టీఆర్ మనందరికీ ప్రాతఃస్మరణీయుడు: ఏపీ సీఎం చంద్రబాబు

  • ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్
  • ‘అన్న’ ఎన్టీఆర్‌ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడన్న చంద్రబాబు 
  • ఆయన వేసిన బాటే మనందరికీ ఆదర్శమన్న సీఎం
కారణజన్ముడు, యుగపురుషుడు, పేదల పెన్నిధిగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.

సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడిగా నిలిచిన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని చంద్రబాబు కొనియాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడని పేర్కొన్నారు.

కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనితరసాధ్యమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్టీఆర్ చరిత్ర గతినే మార్చారని సీఎం గుర్తు చేశారు.

ఆయన వేసిన బాటే మనందరికీ ఆదర్శమని పేర్కొంటూ, మరొక్కమారు ‘అన్న’ ఎన్టీఆర్‌కు స్మృత్యంజలి ఘటిస్తున్నట్లు చంద్రబాబు తన సందేశంలో తెలిపారు. 


More Telugu News