విజయవాడ-హైదరాబాద్ హైవేపై పెరిగిన రద్దీ

  • సంక్రాంతి ముగియడంతో పల్లెల నుంచి పట్టణాల బాట పట్టిన ప్రజలు
  • ప్రయాణికులతో కిటకిటలాడిన బస్టాండ్‌లు
  • టోల్ ప్లాజాలు, కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్న పోలీసులు
సొంత గ్రామాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరడంతో ప్రధాన నగరాల బస్‌ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌లలో భారీ రద్దీ నెలకొంది.

ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.

మరోవైపు పల్లెల నుంచి నగరాల వైపు ప్రజలు భారీగా కార్లలో పయనమవ్వడంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వై - జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సర్వీస్‌ రోడ్లకు మరమ్మతులు చేపట్టి, తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేయడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.

అయితే ఎన్‌హెచ్‌ - 65పై చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్‌ ప్రధాన కూడళ్లలో వాహనాలు బారులు తీరాయి. శనివారం రాత్రి కొర్లపహాడ్‌, పంతంగి టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదిలాయి. టోల్‌ గేట్లు, కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు.

నల్గొండ జిల్లా చిట్యాల వద్ద రద్దీ మరింత ఎక్కువగా కనిపించింది. వేల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను చిట్యాల నుంచి కుడివైపు సింగిల్‌ రోడ్డులో భూవనగిరి మీదుగా హైదరాబాద్‌ వైపుకు మళ్లించారు. వాహనాల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు డ్రోన్‌ కెమెరాలు, సీసీటీవీల సహాయంతో ట్రాఫిక్‌ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 


More Telugu News