Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ను ఏకిపారేసిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy slams BRS over Palamuru project delays
  • మహబూబ్‌నగర్‌లో రూ.1284 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
  • పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకు అన్యాయం జరిగిందని రేవంత్ విమర్శ
  • కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయిందని ఎద్దేవా
  • జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ
  • తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని వెల్లడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన, రూ.1,284 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా అందులో పాలమూరు బిడ్డల చెమట ఉంటుందని, కానీ ఈ జిల్లా మాత్రం వెనుకబడే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2013లో కాంగ్రెస్ నేతలు సాధించుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లకు రూ.23 కోట్లు చెల్లించారని, ఉద్ధండాపూర్ జలాశయం భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. సంగంబండ వద్ద బండను పగులగొట్టేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. జిల్లా ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు రాకుండా పారిపోయారని ఆయన వ్యంగ్యం ప్రదార్శించారు. కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. 

పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 3.50 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యం అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు ఐఐఎం తెస్తే, భూమి ఇచ్చే బాధ్యత తనదని సీఎం స్పష్టం చేశారు.
Revanth Reddy
Palamuru Rangareddy Lift Irrigation Scheme
Telangana projects
KCR
BRS party
Mahabubnagar
Telangana politics
Irrigation projects
Telangana development
Congress party

More Telugu News