KSCA: చిన్నస్వామిలో మళ్లీ క్రికెట్ సందడి... ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

KSCA Chinnaswamy Stadium Gets Green Signal for IPL Matches
  • గతేడాది తొక్కిసలాట ఘటనతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిషేధం
  • అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి
  • జస్టిస్ డి'కున్హా కమిటీ సిఫార్సుల అమలుకు కేఎస్‌సీఏ హామీ
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలుకానుంది. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) శనివారం ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్‌లు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో నెలకొన్న అనిశ్చితికి ఈ అనుమతితో తెరపడింది. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 56 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ... దులీప్ ట్రోఫీ, ఇండియా-సౌతాఫ్రికా 'ఏ' సిరీస్, విజయ్ హజారే ట్రోఫీతో పాటు 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సహా పలు కీలక టోర్నీలను చిన్నస్వామి నుంచి తరలించింది.

ఈ విషాదంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ మైఖేల్ డి'కున్హా కమిటీ సిఫార్సులను అమలు చేస్తేనే మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, భద్రత, ప్రేక్షకుల నిర్వహణకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని కేఎస్‌సీఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ హామీ ఇచ్చారు.

ప్రభుత్వం నుంచి అనుమతి లభించినప్పటికీ, ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లన్నీ చిన్నస్వామిలోనే ఆడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో నిర్వహించేందుకు ఆ జట్టు యాజమాన్యం ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది.
KSCA
M Chinnaswamy Stadium
IPL matches
Royal Challengers Bangalore
RCB
Karnataka government
Cricket
IPL 2026
Vijay Hazare Trophy
Duleep Trophy

More Telugu News