Bhoomika Chawla: 'ఒక్కడు' కాంబోలో మరో సినిమా.. ఆసక్తి రేపుతున్న భూమిక 'యూఫోరియా' ట్రైలర్

Bhoomika Chawla Euphoria Movie Trailer Released
  • గుణశేఖర్ దర్శకత్వంలో 'యూఫోరియా' చిత్ర ట్రైలర్ విడుదల
  • ప్రధాన పాత్రలో భూమిక.. దాదాపు 20 ఏళ్ల తర్వాత గుణశేఖర్‌తో సినిమా
  • మైనర్ల నేరాల నేపథ్యంతో సాగే సమకాలీన సోషల్ డ్రామా
  • ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న చిత్రం
  • గౌతమ్ మీనన్, సారా అర్జున్, నాజర్ కీలక పాత్రల్లో నటన
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'యూఫోరియా'. 'ఒక్కడు' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఉత్కంఠభరితమైన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

షాకింగ్ నిజ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా సాగింది. ఉన్నత లక్ష్యాలతో ఉన్న ఓ అమ్మాయిని ఆమె తండ్రి ఓ పార్టీకి పంపించడం, ఆ తర్వాత మైనర్లు డ్రగ్స్, మద్యం మత్తులో హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటి సన్నివేశాలు చూపించారు. తనపై తానే కేసు పెట్టుకున్న మహిళగా భూమిక కనిపించారు. "వాడిని కడుపులో ఉన్నప్పుడే చంపేయాల్సింది" అంటూ ఆమె చెప్పే శక్తివంతమైన డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. సమాజంలో మైనర్లు పాల్పడుతున్న నేరాల తీవ్రతను ఈ సినిమా చర్చిస్తున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గుణశేఖర్-భూమిక కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో భూమిక పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ పతాకంపై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ కె. పోతన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.



Bhoomika Chawla
Euphoria movie
Gunasekhar
Telugu movies
Gautham Vasudev Menon
Sara Arjun
Crime thriller
Drugs abuse
Minor crimes
Nilima Guna

More Telugu News