Chandrababu Naidu: చరిత్ర తిరగరాయటం తెలుగువాళ్లతోనే సాధ్యం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu History can be rewritten only by Telugu people
  • కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్
  • 2027 జూన్ నాటికి గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని వెల్లడి
  • గ్రీన్ ఎనర్జీలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని ఉద్ఘాటన
చరిత్రను తిరగరాయడం తెలుగువాళ్లకే సాధ్యమని, ప్రపంచ గతిని మార్చే శక్తిసామర్థ్యాలు మనవారికి ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సత్తాను చాటేలా, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు కాకినాడ వేదిక కావడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏఎమ్ గ్రీన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో ఇకపై ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుందని, భవిష్యత్ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "గతంలో ఇదే ప్రాంతంలో నాగార్జునా ఫెర్టిలైజర్స్ గ్రే అమోనియా తయారు చేస్తే, ఇప్పుడు అదే చోట పర్యావరణహితమైన గ్రీన్ అమోనియా ఉత్పత్తి కాబోతోంది. ఇది మార్పునకు సంకేతం. చరిత్రను తిరగరాయడం అంటే ఇదే. తెలుగువాళ్లు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. గత ఏడాది ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తే, సరిగ్గా ఏడాది తిరిగేసరికి పనులు ప్రారంభించడం మన పనితీరుకు నిదర్శనం. ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు చక్కటి ఉదాహరణ" అని అన్నారు. 

495 ఎకరాల్లో, 2 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని వెల్లడించారు. 2027 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభించి, ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను ఇక్కడి నుంచి జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని అందిపుచ్చుకుని, రాష్ట్రంలో 160 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు తెలిపారు. 

"సౌర, పవన, జల విద్యుత్‌తో పాటు పంప్డ్ స్టోరేజీకి ఏపీ అత్యంత అనుకూలమైన రాష్ట్రం. మనకున్న సుదీర్ఘ తీరప్రాంతం, రాబోయే 20 పోర్టులతో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ఏపీ కేంద్రంగా మారుతుంది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీపై ఎక్కడ చర్చ వచ్చినా కాకినాడ పేరు వినిపిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'క్లీన్, గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ-2024' దేశంలోనే అత్యుత్తమమైనదని, పారిశ్రామికవేత్తలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అనుమతులు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ, "విశాఖలో గూగుల్ సంస్థ 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ ఏడాదిలోనే అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. స్పేస్ టెక్నాలజీలో కూడా పురోగతి సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం" అని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

రాష్ట్రంలో పరిశ్రమలపై విద్యుత్ కొనుగోలు భారాన్ని యూనిట్‌కు రూ.1.19 మేర తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే 29 పైసలు తగ్గించామని తెలిపారు. గ్లోబల్ సంస్థలన్నీ ఏపీ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన ఆయన, రాష్ట్రంలోకి వచ్చే ప్రతి పెట్టుబడికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Green Hydrogen Project
Kakinada
Green Ammonia
Pawan Kalyan
AP Government
Renewable Energy
Clean Energy
Investments

More Telugu News