'సేవ్ సికింద్రాబాద్' ర్యాలీకి అనుమతి నిరాకరణ.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

  • నగరం అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే నిరసన తెలిపే హక్కు లేదా అని నిలదీత
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తోందని విమర్శ
  • అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'సేవ్ సికింద్రాబాద్' ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.

నగర అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తోందని విమర్శించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలకు శతాబ్దాల చరిత్ర ఉందని అన్నారు. ఈ రెండు నగరాలు రెండు కళ్లు వంటివని, అలాంటిది వాటి ఐడెంటిటీని తొలగించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని ఆరోపించారు.

అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతామని అన్నారు. రిపబ్లిక్ డేకు పది రోజుల ముందు తెలంగాణలో హక్కుల ఖూనీ జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుండటం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ బిడ్డలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్‌ను జిల్లాగా చేసే ఆలోచన చేస్తామని అన్నారు.


More Telugu News