అండర్-19ప్రపంచకప్‌లో విచిత్ర రనౌట్.. పాక్ బ్యాటర్ నిర్లక్ష్యంతో ఇంగ్లండ్ ఘన విజయం!

  • అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి
  • చివరి వికెట్‌గా పాక్ బ్యాటర్ అలీ రజా విచిత్ర రనౌట్
  • ఫీల్డర్ త్రోను తప్పించుకోబోయి క్రీజు వదిలిన బ్యాటర్
  • సమయస్ఫూర్తితో బెయిల్స్ పడగొట్టిన ఇంగ్లండ్ వికెట్ కీపర్
  • ఇంగ్లండ్ 37 పరుగుల తేడాతో విజయం
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ బ్యాటర్ అలీ రజా అనూహ్య రీతిలో రనౌట్ అవడంతో ఇంగ్లండ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రనౌట్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

జింబాబ్వేలోని తకషింగా స్పోర్ట్స్ క్లబ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ పోరాడుతోంది. ఇన్నింగ్స్ 47వ ఓవర్లో చివరి బ్యాటర్‌గా అలీ రజా క్రీజులో ఉన్నాడు. ఒక బంతిని ఆడిన తర్వాత ఫీల్డర్ వికెట్ కీపర్ వైపు బంతిని విసిరాడు. స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అలీ రజా ఆ బంతి తనను తాకుతుందేమోనని భావించి క్రీజు వదిలి పక్కకు జరిగాడు.

అదే సమయంలో బంతి ఇంకా లైవ్‌లోనే ఉందని గమనించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్, కెప్టెన్ థామస్ రివ్ అప్రమత్తమయ్యాడు. అతడు వెంటనే బంతిని అందుకుని వికెట్లను గిరాటేశాడు. దీంతో అలీ రజా రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ రనౌట్‌తో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 46.3 ఓవర్లలో 173 పరుగుల వద్ద ముగిసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, కాలెబ్ ఫాల్కనర్ (66) రాణించడంతో 210 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (65) పోరాడినా ఫలితం లేకపోయింది. అలీ రజా ఏకాగ్రత కోల్పోవడం వల్లే ఈ రనౌట్ జరిగిందని, ఇది ఒక "బ్రెయిన్ ఫేడ్" మూమెంట్ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంతో ఇంగ్లండ్ టోర్నీలో శుభారంభం చేసింది.


More Telugu News