Nara Lokesh: కాకినాడలో 'ఏఎమ్ గ్రీన్' రూ.83 వేల కోట్ల పెట్టుబడి... మంత్రి నారా లోకేశ్ ప్రకటన

Nara Lokesh Announces AM Green 83000 Crore Investment in Kakinada
  • కాకినాడలో ఏఎమ్ గ్రీన్ భారీ ప్రాజెక్ట్
  • 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గ్రీన్ అమ్మోనియా టెర్మినల్
  • 8,000కు పైగా ఉద్యోగ అవకాశాలు
  • జర్మనీ, సింగపూర్, జపాన్‌లకు గ్రీన్ ఎనర్జీ ఎగుమతి
  • ప్రపంచ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి కీలక స్థానం
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి రాబోతోంది. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ (AM Green) సంస్థ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,000 కోట్లు) పెట్టుబడితో గ్రీన్ అమ్మోనియా ఎగుమతి టెర్మినల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 8,000 మందికి పైగా నాణ్యమైన ఉద్యోగాలు లభించనున్నాయని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఏఎమ్ గ్రీన్ ఏర్పాటు చేయనున్న ఈ టెర్మినల్ ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక్కడ తయారైన గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, సింగపూర్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ను దాదాపు 7.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 1 గిగావాట్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ద్వారా సమకూర్చనున్నారు.

అమ్మోనియా రూపంలో గ్రీన్ ఎనర్జీని విదేశాలకు ఎగుమతి చేయడం భారతదేశ చరిత్రలోనే ఇది తొలిసారని లోకేశ్ పేర్కొన్నారు. ఈ భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ గ్రీన్ ఎనర్జీ వ్యాల్యూ చెయిన్‌లో అగ్రగామిగా నిలవనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతాన్ని ఇవ్వడమే కాకుండా, హరిత ఇంధన రంగంలో ఏపీకి కీలక స్థానాన్ని కట్టబెట్టనుందని తెలిపారు.
Nara Lokesh
AM Green
Kakinada
Andhra Pradesh investment
Green ammonia
Green energy export
Renewable energy
AP economy
AP IT Minister
Job creation

More Telugu News