Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy Writes Letter to CM Revanth Reddy on Hyderabad Metro
  • హైదరాబాద్ రెండో దశ పనుల పురోగతిపై లేఖ రాసిన కేంద్ర మంత్రి
  • మెట్రో రెండో దశ గురించి కేంద్ర మంత్రితో చర్చించానన్న కిషన్ రెడ్డి
  • మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న కేంద్ర మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై ఆయన ఈ లేఖ రాశారు. మెట్రోను ఎల్ అండ్ టీ నుండి స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని మీరే ప్రకటించారని రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు.

మెట్రో రెండో దశ నిర్మాణం గురించి తాను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి చర్చించానని, అయితే ముందుగా మొదటి దశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారని అన్నారు. ఇందుకు సంబంధించి నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి కావాలని, ఆ తర్వాత రెండో దశ మెట్రో నిర్మాణంపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందని ఆ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయించినట్లు కూడా ఖట్టర్ తనకు తెలిపారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, కానీ ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను పంపించాలని కోరారు.
Kishan Reddy
Revanth Reddy
Telangana
Hyderabad Metro
Metro Phase 2
L&T Metro
Manohar Lal Khattar

More Telugu News