బెంగళూరులో మహేశ్ బాబు 'ఏఎంబీ సినిమాస్' ప్రారంభం... మెగాస్టార్ సినిమాతో బోణీ!

  • సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ విజన్ సినిమా థియేటర్‌గా గుర్తింపు
  • సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సంస్థలో భాగస్వామి
  • తొలి షోగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రదర్శన
  • అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త వీక్షణ అనుభూతి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ (AMB) సినిమాస్, దక్షిణాదిలోనే తొలి డాల్బీ విజన్ సినిమా థియేటర్‌ను ప్రారంభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జనవరి 16న ఈ సరికొత్త మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో సౌత్ ఇండియాలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమా వీక్షించే అనుభూతిని అందించే తొలి థియేటర్‌గా ఏఎంబీ సినిమాస్ నిలిచింది.

ఈ థియేటర్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఇందులో 586 సీట్ల కెపాసిటీతో 65 అడుగుల విశాలమైన కర్వ్డ్ స్క్రీన్ ఉంది. 5 డాల్బీ అట్మాస్ స్క్రీన్లు, నాలుగు డాల్బీ 7.1 స్క్రీన్లు, రెండు ఫ్లాట్ స్క్రీన్లుఉ న్నాయి. కర్వ్డ్ స్క్రీన్ లో అత్యంత స్పష్టత కోసం డ్యూయల్ ప్రొజెక్షన్ 4K టెక్నాలజీని, అద్భుతమైన సౌండ్ కోసం 64 ఛానల్ ఆబ్జెక్ట్ బేస్డ్ డాల్బీ అట్మాస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు ప్రతి సీటు నుంచి మెరుగైన వీక్షణ పొందేలా సీటింగ్‌ను కూడా కర్వ్డ్ స్టేడియం శైలిలో రూపొందించారు.

ఈ డాల్బీ విజన్ థియేటర్ లో ఓ స్క్రీన్ పై తొలి షోగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్‌గారు' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాను ప్రత్యేకంగా డాల్బీ విజన్ టెక్నాలజీతో గ్రేడ్ చేయడం విశేషం. కాగా, బెంగళూరులో తమ మల్టీప్లెక్స్ ప్రారంభం గురించి మహేశ్ బాబు కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.


More Telugu News