KTR: ఈ విధానాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించడం యావత్ తెలంగాణకు గర్వకారణం: కేటీఆర్

KTR NITI Aayog Praises TS iPASS Telangana Pride
  • టీఎస్ ఐపాస్ విధానాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిందన్న కేటీఆర్
  • ఈ విధానం ద్వారా రూ. 2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి
  • పదేళ్లలో 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని స్పష్టీకరణ
  • కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో బతకొద్దని ప్రత్యర్థులకు హితవు
  • రైతుబంధు, మిషన్ భగీరథలాగే టీఎస్ ఐపాస్‌కు జాతీయ గుర్తింపు లభించిందని వ్యాఖ్య
తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన టీఎస్ ఐపాస్ (TS-iPASS) విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తు నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో ప్రశంసించడం తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేసీఆర్ దార్శనికతకు ఈ గుర్తింపే నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. 

కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల కాలంలోనే దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో టీఎస్ ఐపాస్ పోషించిన పాత్ర అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వ సంస్థే చెప్పడం గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగించి, సింగిల్ విండో విధానంలో కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా టీఎస్ ఐపాస్‌ను రూపొందించామని కేటీఆర్ గుర్తుచేశారు. అవినీతికి ఏమాత్రం తావులేని అత్యంత పారదర్శకమైన ఈ విధానాన్ని పదేళ్లపాటు చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లే అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. 

ఈ విధానం ద్వారా భారీ పరిశ్రమలతో పాటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) విభాగంలో రూ. 2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని వ్యాఖ్యానించారు.

గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ-హబ్ వంటి వినూత్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లే, ఇప్పుడు టీఎస్ ఐపాస్‌కు కూడా లభించిందని కేటీఆర్ తెలిపారు. ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి చిన్న పరిశ్రమల వరకు తెలంగాణ వైపు చూసేలా పెట్టుబడిదారుల్లో ఈ విధానం కొండంత విశ్వాసాన్ని నింపిందన్నారు. 

"ఇకనైనా కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో బతికే అరాచక శక్తులు బుద్ధి తెచ్చుకుంటే మంచిది" అని పరోక్షంగా ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ మోడల్ ఆచరణీయమని నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత కూడా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.


KTR
K Taraka Rama Rao
Telangana
TS iPASS
NITI Aayog
KCR
BRS
Telangana Industries
Investments
Ease of Doing Business

More Telugu News