మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన మలయాళ సినిమానే 'కలంకావల్'. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. జితేన్ కె జొస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, 'జైలర్' విలన్ వినాయగన్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. మమ్ముట్టి సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, డిసెంబర్ 5వ తేదీన థియేటర్లకి వచ్చింది. ఈ రోజు నుంచి ఈ సినిమా 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్ల నుంచి 80 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: కేరళ - తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఒక యువతి మిస్సింగ్ కేసు, గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమవుతుంది. దాంతో క్రైమ్ బ్రాంచ్ కి చెందిన స్పెషల్ ఆఫీసర్ గా జయకృష్ణ (వినాయగన్) నియమించబడతాడు. విమల అనే ఆ యువతి కేసును ఛేదించడం మొదలుపెట్టిన జయకృష్ణకి, చాలా కాలం నుంచి చాలామంది యువతులు కనిపించకుండాపోయారనే విషయం అర్థమవుతుంది.

ఆ యువతులంతా ప్రేమించిన వారితో ఊరొదిలి వెళ్లిపోయారని తెలుసుకుని జయకృష్ణ ఆశ్చర్యపోతాడు. కనిపించకుండా పోయినవారిలో చాలామంది విడాకులు తీసుకున్నవారు .. భర్తను కోల్పోయినవారని గ్రహిస్తాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడానికి ఇదే ప్రధానమైన కారణమనే విషయం అతనికి అర్థమవుతుంది. అదృశ్యమైన యువతులంతా, ఆ తరువాత హత్యకి గురికావడం అతనిని కలవరపెడుతుంది.

కొంతమంది యువతులు గుండెపోటు వలన చనిపోయారనీ, మరికొంతమంది విషప్రయోగం వలన చనిపోయారని తెలిసి జయకృష్ణ ఆలోచనలో పడతాడు. సాధ్యమైనంత త్వరగా హంతకుడిని పట్టుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఒక వైపు నుంచి జయకృష్ణ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే, మరో వైపున యువతులు అదృశ్యమవుతూనే ఉంటారు. అందుకు కారకులు ఎవరు? వాళ్ల ఉద్దేశం ఏమిటి? ఈ కేసును జయకృష్ణ ఎలా ఛేదిస్తాడు? అనేది కథ. 

విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లకు సంబంధించిన కథలను తెరకెక్కించడంలో మలయాళ దర్శకులు మంచి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. ఈ రెండు అంశాలను కలుపుకుంటూ సైకాలజీ థ్రిల్లర్ గా నిర్మితమైన సినిమా ఇది. కిల్లర్ కీ .. పోలీస్ ఆఫీసర్ కి మధ్య నడిచే ఈ కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ రెండు పాత్రలను మలచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. 

 దర్శకుడు పాత్రలను మలిచిన తీరు .. ఆ పాత్రల కోసం ఆర్టిస్టులను ఎంచుకున్న విధానం కొత్తగా అనిపిస్తుంది .. కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ప్రధానమైన పాత్రలు రెండే అయినప్పటికీ కథ ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు నడిపించిన విధానం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఎక్కడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కథ చాలా సహజంగా కదులుతూ కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ఒక కథను కూడా చెప్పొచ్చు అని నిరూపిస్తుంది. 

పనితీరు: ఈ కథలో మూడు ప్రధానమైన కోణాలు కనిపిస్తాయి. సైకో కిల్లర్ అమ్మాయిలను ట్రాప్ లో పడేయడం .. అమ్మాయిల నేపథ్యం .. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్. ఈ మూడు అంశాలకు సంబంధించిన నేపథ్యాలను దర్శకుడు ఆవిష్కరించిన విధానమే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎలాంటి ఛేజింగులు .. యాక్షన్ సీన్స్ లేకుండా ఈ కథను ఆసక్తికరంగా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఒక వైపున హంతకుడిని .. మరో వైపున ఇన్వెస్టిగేషన్ ను చూపిస్తూనే ఉంటారు. హంతకుడిని ఎలా పట్టుకుంటారు? అనే అంశమే ఆడియన్స్ లో ఉత్కంఠను పెంచే విషయం. ఈ విషయంలో మాత్రం పట్టుసడలని స్క్రీన్ ప్లే మార్కులు కొట్టేస్తుంది. మమ్ముట్టి - వినాయగన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఫైసల్ అలీ ఫొటోగ్రఫీ .. ముజీబ్ మజీద్ నేపథ్య సంగీతం .. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి.

ముగింపు: సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను టచ్ చేస్తూ సాగే సినిమాలలో హింస .. రక్తపాతం .. అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటివేమీ కనిపించవు. అయినా ఉత్కంఠను పెంచుతూనే వెళుతుంది. కథలోని మలుపులు .. లొకేషన్స్ .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయి.