Nitin Nabin: జనవరి 20న బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన.. రేసులో ముందున్న నబీన్

Nitin Nabin Leading the Race for BJP National President
  • ఈ నెల 19న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉంటుందని వెల్లడి
  • అదే రోజు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ
  • మరుసటి రోజు కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తామని వెల్లడి
బీజేపీ తన తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు మరియు బీజేపీ జాతీయ ఎన్నికల ఇన్‌ఛార్జ్ డాక్టర్ కె. లక్ష్మణ్ ఒక అధికారిక ప్రకటనలో సంస్థాగత కసరత్తు కోసం షెడ్యూల్‌ను వెల్లడించారు.

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం జనవరి 19న నామినేషన్లు దాఖలు కానున్నాయని, మరుసటి రోజు 20వ తేదీన కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామని తెలిపారు. జనవరి 19న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య నామినేషన్లను దాఖలు చేస్తారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నామినేషన్ పత్రాల పరిశీలన, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.

అదేరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు అధికారిక పత్రికా ప్రకటన జారీ చేస్తామని, అనంతరం మరుసటి రోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య ఢిల్లీలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు.

బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ ఇటీవల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయననే నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోందని సమాచారం. యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో భాగంగా నబీన్‌కు పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. నబీన్ బీహార్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. గతంలో సిక్కిం, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 14న ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Nitin Nabin
BJP National President
BJP Election
K Laxman
Bihar BJP
BJP organizational elections

More Telugu News