Talasani Srinivas Yadav: సికింద్రాబాద్ ప్రాంతాలను మల్కాజిగిరిలో కలిపేశారు: తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్

Talasani Srinivas Yadav Criticizes Merger of Secunderabad Areas into Malkajgiri
  • సికింద్రాబాద్ అస్తిత్వం ప్రమాదంలో ఉందన్న తలసాని
  • రేవంత్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని విమర్శ
  • సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కూడా కుట్ర జరుగుతోందని మండిపాటు

సికింద్రాబాద్‌కు శతాబ్దాలుగా ఉన్న ప్రత్యేక చరిత్రను ఎవ్వరూ మరిచిపోలేరని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజిగిరిలో కలిపేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సికింద్రాబాద్ అస్తిత్వానికే ప్రమాదంగా మారుతోందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.


ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని తలసాని విమర్శించారు. అసలు సమస్యలపై దృష్టి పెట్టకుండా తుగ్లక్ పాలనలా వ్యవహరించడం సరికాదని సూచించారు. సికింద్రాబాద్ పేరును మార్చేందుకు కూడా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సికింద్రాబాద్ అనేది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని, ఇక్కడి ప్రజలకు అది ఒక భావోద్వేగమని చెప్పారు. తమ గుర్తింపు, అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన కీలక సమయంలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.


సికింద్రాబాద్ కార్పొరేషన్ జిల్లా ఏర్పాటు కోసం చేపడుతున్న శాంతియుత ర్యాలీని ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని తలసాని కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే, కోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకుంటామని తెలిపారు.

Talasani Srinivas Yadav
Secunderabad
Malkajgiri
Revanth Reddy
BRS
Telangana Politics
Secunderabad Corporation
North Zone
Political Controversy

More Telugu News