Kasu Mahesh: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని, సీఐ భాస్కర్ అండతోనే హత్య జరిగింది: కాసు మహేశ్
- సాల్మన్‌ను పథకం ప్రకారమే హత్య చేశారన్న కాసు మహేశ్
- పిన్నెల్లి గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్య
- భయంతో వందలాది కుటుంబాలు బయటి ప్రాంతాలకు వెళ్లిపోయాయన్న మహేశ్
పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్‌ను టీడీపీ నేతలు పథకం ప్రకారమే హత్య చేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ ఆరోపించారు. ఈ హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ ల హస్తం ఉందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పిన్నెల్లి గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని కాసు మహేశ్ తెలిపారు. గ్రామంలో రాజకీయ వేధింపులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో వందలాది కుటుంబాలు భయంతో తమ ఇళ్లను వదిలి బయట ప్రాంతాలకు వెళ్లిపోయాయని అన్నారు. సాల్మన్ కూడా భద్రత లేక గ్రామాన్ని విడిచిపెట్టి బయట జీవనం సాగిస్తున్నాడని చెప్పారు.
సాల్మన్ భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెతో మాట్లాడేందుకు అతడు పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడని తెలిపారు. అయితే అతను గ్రామానికి వచ్చిన విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు అతనిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాల్మన్ మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు మృతి చెందాడని చెప్పారు.
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు... తేలికపాటి, పనికిమాలిన సెక్షన్లు మాత్రమే పెట్టారని తీవ్రంగా విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నీతులు చెప్పడం కాదని, పిన్నెల్లి గ్రామం నుంచి భయంతో బయటకు వెళ్లిపోయిన 1500 మంది ప్రజల పరిస్థితిపై సమాధానం చెప్పాలని అన్నారు. ఈ హత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.