Asim Iftikhar Ahmad: ఐక్యరాజ్య సమితిలో మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్.. తీవ్రంగా స్పందించిన భారత్

Asim Iftikhar Ahmad Raises Kashmir Issue at UN India Responds Strongly
  • పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందన్న భారత్
  • జమ్ము కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సూచనలు అవసరం లేదన్న భారత్
  • అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పడం సరికాదని హితవు
ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని మరోమారు ప్రస్తావించగా, భారత్ దీటుగా స్పందించింది. జమ్ము కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని, అది ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పాకిస్థాన్ కశ్మీర్ గురించి పదే పదే మాట్లాడకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.

భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ పాకిస్థాన్ ఆరోపణలను ఖండించారు. పదేపదే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ, అబద్ధాలు చెబుతూ పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు భారత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వారి ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారని తెలిపారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సూచనలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్ నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని పున్నూస్ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా ఎటువంటి ఫలితం ఉండదని హితవు పలికారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని సూత్రాలను ఉపయోగించడం సముచితం కాదని అన్నారు. ప్రపంచ దేశాలలో జరుగుతున్న హింసపై ఐక్యరాజ్య సమితి స్పందించాలని, వివిధ దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకాలని ఆయన సూచించారు.
Asim Iftikhar Ahmad
Pakistan
Jammu Kashmir
India
United Nations
UN
Eldos Matthew Punnoose

More Telugu News