Nisha Verma: 'పురుషులు గర్భం దాల్చగలరా?': అమెరికా సెనెట్‌లో డాక్టర్ నిషా వర్మకు వింత ప్రశ్న

Nisha Verma faces question on men getting pregnant in US Senate
  • యూఎస్ సెనేట్‌లో భారత సంతతి వైద్యురాలికి వింత అనుభవం
  • మగాళ్లు గర్భం దాల్చగలరా? అని పదేపదే ప్రశ్నించిన సెనేటర్
  • ఇవి రాజకీయ ప్రేరేపిత ప్రశ్నలని తిప్పికొట్టిన డాక్టర్ నిషా వర్మ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సెనేటర్, డాక్టర్ సంభాషణ
అమెరికా సెనెట్‌లో అబార్షన్ మాత్రల (Mifepristone) భద్రతపై జరిగిన చర్చ అనూహ్యంగా 'బయోలాజికల్ జెండర్' చర్చకు దారితీసింది. భారత సంతతికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నిషా వర్మను రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలీ ‘పురుషులు గర్భం దాల్చగలరా?’ అని పదే పదే ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం, దానికి సెనేటర్ ప్రతిస్పందన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

అసలేం జరిగింది?
చర్చ సందర్భంగా డాక్టర్ నిషా వర్మ మాట్లాడుతూ.. గర్భం దాల్చిన వ్యక్తులు (Pregnant People) అని సంబోధించారు. దీనికి అభ్యంతరం తెలిపిన సెనేటర్ హాలీ "మీరు వ్యక్తులు అంటున్నారు.. అంటే పురుషులు కూడా గర్భం దాల్చగలరని మీ ఉద్దేశమా?" అని అడిగారు. దీనికి డాక్టర్ నిషా స్పందిస్తూ.. "మీరు ఈ ప్రశ్నను ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను రకరకాల గుర్తింపులు ఉన్న రోగులకు చికిత్స అందిస్తుంటాను" అని సమాధానమిచ్చారు.

సైన్స్ వర్సెస్ రాజకీయాలు
సెనేటర్ హాలీ ఈ విషయాన్ని ఇక్కడితో వదలకుండా "ఇది రాజకీయ ప్రశ్న కాదు, కేవలం జీవశాస్త్ర పరమైన వాస్తవం (Biological Reality). అవును లేదా కాదు అని చెప్పండి" అని పట్టుబట్టారు. దీనికి డాక్టర్ నిషా వర్మ బదులిస్తూ.. ఇటువంటి 'అవును/కాదు' ప్రశ్నలు కేవలం రాజకీయ సాధనాలుగా మారుతున్నాయని, వైద్య శాస్త్రంలోని సంక్లిష్టతను ఇవి విస్మరిస్తాయని పేర్కొన్నారు. దీనిపై సెనేటర్ తీవ్రంగా స్పందిస్తూ "పురుషులు గర్భం దాల్చలేరనే కనీస వాస్తవాన్ని అంగీకరించని మీ సాక్ష్యాన్ని మేం ఎలా నమ్మాలి?" అని ప్రశ్నించారు.

ఎవరీ డాక్టర్ నిషా వర్మ?
నార్త్ కరోలినాలో భారత వలస దంపతులకు జన్మించిన నిషా వర్మ, ప్రస్తుతం ప్రసూతి, గైనకాలజీ వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్నారు. ఆమె 'ఫిజీషియన్స్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్' సంస్థలో ఫెలోగా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్‌లో సీనియర్ సలహాదారుగా ఉన్నారు. ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా సేవలందిస్తున్నారు. అబార్షన్ మందుల భద్రతపై తన నమ్మకాన్ని వివరిస్తూ ఇటీవలే గర్భస్రావం జరిగినప్పుడు తాను కూడా అవే మందులు వాడినట్లు ఆమె కమిటీకి తెలిపారు. ఈ వివాదంపై ఎలోన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా స్పందిస్తూ ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి రావడం విచారకరమని వ్యాఖ్యానించారు.
Nisha Verma
abortion pill
Mifepristone
US Senate
Josh Hawley
biological gender
pregnant people
reproductive health
Elon Musk

More Telugu News