కేసీఆర్‌ను విమర్శించడానికి మేం అవసరం లేదు.. ఆమె చాలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆరోపణ
  • కేసీఆర్ చేసిన అప్పులను తీరుస్తున్నామన్న మంత్రి 
  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను విమర్శించేందుకు తాము అవసరం లేదని, ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సరిపోతారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేస్తే, వాటిని తమ ప్రభుత్వం తీర్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

అప్పులు తీరుస్తూనే రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ వల్ల పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి మోసాలు చేయాలని చూస్తే, ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కేసీఆర్ మాత్రం ఏదో ఒకరోజు మాత్రమే పనుల కోసం సమయం కేటాయించారని విమర్శించారు. అందుకే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. వివిధ పథకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు.

మరో ఇరవై రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని పార్టీలకు ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారని, పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని ఆయన సవాల్ విసిరారు.


More Telugu News