డెన్మార్క్‌లోనే ఉంటామన్న గ్రీన్‌లాండ్ ప్రధాని.. హెచ్చరించిన ట్రంప్

  • డెన్మార్క్‌లోనే కొనసాగాలంటే అది వారికే పెను సమస్యగా మారుతుందన్న ట్రంప్
  • ఫ్రెడరిక్ అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదన్న ట్రంప్
  • అమెరికాలో చేరకుంటే రష్యా, చైనా ఆక్రమిస్తాయని గ్రీన్‌లాండ్ కు హెచ్చరిక
తాము డెన్మార్క్‌లోనే ఉంటామని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమెరికాలో తాము చేరబోమని జెన్స్ ఫ్రెడరిక్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ట్రంప్ గ్రీన్‌లాండ్‌కు మరోమారు హెచ్చరికలు జారీ చేశారు.

డెన్మార్క్‌లో కొనసాగడం గ్రీన్‌లాండ్‌కు పెను సమస్యగా పరిణమిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. డెన్మార్క్‌లో కొనసాగాలనేది జెన్స్ ఫ్రెడరిక్ వ్యక్తిగత సమస్య అని అభివర్ణించిన ట్రంప్, ఆయన అభిప్రాయంతో తాను ఏకీభవించబోనని అన్నారు. ఆయన గురించి తనకు పెద్దగా తెలియదని, డెన్మార్క్‌లో కొనసాగితే గ్రీన్‌లాండ్‌కే నష్టమని స్పష్టం చేశారు.

గ్రీన్‌లాండ్ తప్పనిసరిగా అమెరికా భూభాగంలో చేరాలని ట్రంప్ అల్టిమేటం విధించారు. లేని పక్షంలో ఆ ప్రాంతాన్ని రష్యా, చైనా వంటి దేశాలు ఆక్రమిస్తాయని హెచ్చరించారు. ఆ దేశాలకు చెందిన రక్షణ బలగాలు ఇప్పటికే అక్కడ పాగా వేశాయని వ్యాఖ్యానించారు. తాను తలుచుకుంటే వారి కంటే అధిక సంఖ్యలో సైన్యాన్ని మోహరించగలనని పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌లో అమెరికా జెండా ఎగరాలని ట్రంప్ ఆకాంక్షించారు.

ఇటీవల గ్రీన్‌లాండ్ ప్రజలకు ట్రంప్ నగదు ఆఫర్ చేసినట్టు వార్తలు రావడం తెలిసిందే. దీనిపై ఆయనను మీడియా ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని బదులిచ్చారు.


More Telugu News