Dayanidhi Maran: హిందీపై దయానిధి మారన్ వ్యాఖ్యల దుమారం.. మనుషులను బానిసలుగా మారుస్తున్నారని వ్యాఖ్య
- ఉత్తరాదిలో ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తున్నారన్న దయానిధి
- మహిళలను ఇంటికే పరిమితం చేస్తున్నారన విమర్శ
- అందుకే ఉత్తరాది నుంచి దక్షిణాదిక వలసలు పెరుగున్నాయని వ్యాఖ్య
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తర భారతదేశంలో మహిళలను ఇంటికే పరిమితం చేసి వంటగది పనులు చేసుకుని పిల్లలను కనమని చెబుతారని, అక్కడి విద్యా విధానాలు కేవలం హిందీకే ప్రాధాన్యం ఇస్తూ ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. అలాంటి విధానాల వల్లే ఉత్తర రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. ఇంగ్లీష్ చదవకుండా భయపెడితే మనుషులను బానిసలుగా మార్చినట్టే అని ఆయన తీవ్రంగా స్పందించారు.
తమిళనాడులో మహిళలకు విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారణమని మారన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ద్రావిడ మోడల్ బాలికలు-బాలురు అనే తేడా లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పిస్తోందని, ఇక్కడి విద్యావంతులైన యువత వల్లే ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తమిళనాడుకు వస్తున్నాయని ఆయన వివరించారు. హిందీకి మాత్రమే పరిమితమైన విద్యా విధానం కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం చదవకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, భాషపై ఆంక్షలు అభివృద్ధి మరియు ఉపాధికి అడ్డంకిగా మారుతున్నాయని మారన్ వ్యాఖ్యానించారు. ఈ విధానాలతో తమిళనాడులో అక్షరాస్యత రేటు పెరగడమే కాకుండా మహిళల ఉద్యోగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని ఆయన వెల్లడించారు.
మారన్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
ఈ వ్యాఖ్యలు ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య భాషా, విద్యా వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ మారన్‌కు బుద్ధి లేదని విమర్శించింది. హిందీ మాట్లాడేవారిని చదువులేని, సంస్కారం లేని వారిలా చిత్రీకరించడం దురదృష్టకరమని బీజేపీ నేత తిరుపతి నారాయణన్ అన్నారు. మారన్ హిందీ మాట్లాడే ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్.... మారన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఉత్తర భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడేవారు తక్కువగా ఉన్నారని, ఇది రాష్ట్రాన్ని పాలించే పార్టీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారని, తమిళనాడులో తాము మహిళల కోసం పోరాడి వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేశామని ఇళంగోవన్ చెప్పుకొచ్చారు. ప్రారంభం నుంచే మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.