రాజ్‌కోట్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ షో... కివీస్ టార్గెట్ ఎంతంటే...!

  • 92 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్
  • తొలుత బ్యాటింగ్ చేసిన భారత్... 50 ఓవర్లలో 284/7 స్కోరు
  • టాపార్డర్ విఫలమైన వేళ.. కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్న కేఎల్ రాహుల్
  • కివీస్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్‌కు మూడు వికెట్లు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో కదం తొక్కాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన క్లిష్ట సమయంలో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. రాహుల్ (112 నాటౌట్) శతకంతో చెలరేగడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) మంచి ఆరంభాన్ని ఇచ్చినా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (24) నిరాశపరిచాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (8), విరాట్ కోహ్లీ (23) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో భారత్ 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. తొలుత రవీంద్ర జడేజా (27)తో, ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (20)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కేవలం 92 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ ఒంటరి పోరాటం వల్లే భారత్ ఈ పోరాడగలిగే స్కోరును సాధించగలిగింది. కివీస్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లతో సత్తా చాటాడు. సిరీస్‌లో నిలవాలంటే న్యూజిలాండ్ 285 పరుగులు చేయాల్సి ఉంది.


More Telugu News