Dinesh Patnaik: 40 ఏళ్లుగా ఉగ్రవాదంపై కెనడాకు చెబుతున్నాం.. కానీ!: భారత రాయబారి విమర్శలు

Dinesh Patnaik criticizes Canada on terrorism inaction
  • ఉగ్రవాదాన్ని అరికట్టడంలో 40 ఏళ్లుగా విఫలమవుతున్నారని ఆగ్రహం
  • భారత్ వ్యతిరేక కుట్రలకు ఒట్టావా కేంద్రంగా మారుతోందని ఆరోపణ
  • భారత్‌ను ఆధారాలు అడుగుతున్న కెనడా, తాను మాత్రం ఆధారాలు చూపించడం లేదని విమర్శ
కెనడా గడ్డ నుంచి జరుగుతోన్న ఉగ్రవాద కుట్రల గురించి తాము పదేపదే చెబుతున్నప్పటికీ, దానిని అరికట్టడంలో కెనడా 40 సంవత్సరాలుగా విఫలమవుతోందని కెనడాలోని భారత హైకమిషనర్ దినేశ్ పట్నాయక్ విమర్శించారు. భారత్ వ్యతిరేక కుట్రలకు ఒట్టావా కేంద్రంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కెనడా మీడియా సంస్థ సీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. నాలుగు దశాబ్దాలుగా కెనడా దేశాధినేతలు ఎవరైనా ఉగ్రవాద కట్టడికి చర్యలు చేపట్టారా అని ప్రశ్నించారు. భారత్ ఆధారాలు సమర్పించిన వివిధ కేసుల్లో ఒక్కరికైనా శిక్ష పడిందా అని నిలదీశారు.

ఉగ్రవాదం విషయంలో కెనడా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదుల గురించి భారత్ మాట్లాడినప్పుడు ఆధారాలు కావాలని డిమాండ్ చేస్తోన్న కెనడా ప్రభుత్వం, మన దేశంపై ఆరోపణలు చేసినప్పుడు మాత్రం ఆధారాలు చూపించడం లేదని అన్నారు.

నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్రపై కచ్చితమైన సమాచారం ఉందని కెనడా చెబుతున్నప్పుడు, అందుకు తగిన ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడాలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదయిందని, కానీ భారత ప్రభుత్వంపై ఎలాంటి అభియోగాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
Dinesh Patnaik
Canada
India
Terrorism
Khalistan
Hardeep Singh Nijjar
Nijjar murder case
Indian High Commissioner

More Telugu News