అప్పుల పాలైన భర్త కోసం హైదరాబాద్ లో దొంగగా మారిన భార్య

  • గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసిన మహిళ
  • అవంతీనగర్ లో వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెల తాడు అపహరణ
  • సీసీటీవీ ఫుటేజీల సాయంతో అరగంటలోనే పట్టుకున్న పోలీసులు
వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలైన భర్త కోసం తాను కూడా కష్టపడాలని, డబ్బు సంపాదించాలని భార్య నిర్ణయించుకుంది.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి దొంగగా మారింది. ఓ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లింది. హైదరాబాద్ లోని సనత్ నగర్ ప్రాంతం అవంతీనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అరగంటలోనే దొంగను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

వరంగల్ కు చెందిన అనితా రెడ్డి ఉన్నత చదువులు చదివి చెన్నైలో కొంతకాలం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. మేడ్చల్ కు చెందిన రాజేశ్ తో రెండేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ పాప ఉంది. రాజేశ్ చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు భర్త పడుతున్న బాధను చూడలేక తాను కూడా డబ్బు సంపాదించాలని అనిత దొంగగా మారింది.

ఈ నెల 13న అవంతీనగర్ లో ఓ వృద్ధురాలిని వెంబడించిన అనిత.. బిల్డింగ్ లిఫ్ట్ లో ఆమె మెడలోని మంగళసూత్రం కొట్టేసి పారిపోయింది. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు అనితను గుర్తించి అరగంటలోనే అదుపులోకి తీసుకున్నారు. భర్త చేసిన అప్పులు తీర్చడానికే దొంగతనం చేసినట్లు అనిత పోలీసులకు వెల్లడించింది.


More Telugu News