భారతీయుల నిర్బంధం చట్టవిరుద్ధం: అమెరికా ఇమిగ్రేషన్ అధికారులకు కోర్టుల మొట్టికాయలు

  • అమెరికాలో భారతీయులను అక్రమంగా నిర్బంధిస్తున్నారని పలు కోర్టుల తీర్పు
  • బెయిల్ హియరింగ్ లేకుండా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టీకరణ
  • కాలిఫోర్నియా, మిషిగాన్, పెన్సిల్వేనియా కోర్టుల నుంచి ఐస్‌కు ఎదురుదెబ్బ
  • నిబంధనలకు విరుద్ధంగా అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని ఆదేశాలు
  • ఇప్పటికే దేశంలో నివసిస్తున్న వారిపై కఠిన నిబంధనలు సరికాదన్న న్యాయస్థానాలు
అమెరికాలో నివసిస్తున్న పలువురు భారతీయ పౌరులను ఇమిగ్రేషన్ అధికారులు అక్రమంగా నిర్బంధించడాన్ని అక్కడి ఫెడరల్ కోర్టులు తీవ్రంగా తప్పుబట్టాయి. బెయిల్ హియరింగ్స్ నిర్వహించకుండా, చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు వారిని నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశాయి. ఈ మేరకు కాలిఫోర్నియా, మిషిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లోని ఫెడరల్ కోర్టులు ఈ నెలలో సంచలన తీర్పులు వెలువరించాయి.

నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధంలో ఉంచిన భారతీయ పౌరులను తక్షణమే విడుదల చేయాలని, లేదా వారికి వెంటనే బెయిల్ హియరింగ్స్ నిర్వహించాలని న్యాయస్థానాలు ఆదేశించాయి. ఇప్పటికే దేశంలో నివసిస్తున్న వారిపై, దేశంలోకి కొత్తగా ప్రవేశించే వారికి వర్తించే తప్పనిసరి నిర్బంధ నిబంధనలను ప్రయోగించడాన్ని కోర్టులు తీవ్రంగా తప్పుబట్టాయి.

కాలిఫోర్నియాలోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు, వికాస్ కుమార్ అనే భారతీయుడి కేసులో ఐస్ అధికారుల తీరును తప్పుబట్టింది. 2024లో అమెరికాలోకి ప్రవేశించిన వికాస్, పెరోల్‌పై విడుదలై వర్క్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, సోషల్ సెక్యూరిటీ నంబర్ కూడా పొందారు. ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న అతడిని 2025 డిసెంబర్‌లో ఫుడ్ డెలివరీ చేస్తుండగా అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసు, వివరణ లేకుండా అతని పెరోల్‌ను రద్దు చేయడం రాజ్యాంగంలోని ఐదవ సవరణను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ, అతడిని వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

ఇదే తరహాలో మిషిగాన్‌లో వరుణ్ వరుణ్, సుమిత్ తులసీభాయ్ పటేల్, పెన్సిల్వేనియాలో అమిత్ కనౌత్ కేసుల్లోనూ కోర్టులు వారికి అనుకూలంగా తీర్పులనిచ్చాయి. వీరంతా ఏళ్ల తరబడి అమెరికాలో నివసిస్తూ, చట్టపరంగా ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్న వారే. ఒకసారి పెరోల్ లేదా బాండ్‌పై విడుదలైన వారికి స్వేచ్ఛకు సంబంధించిన హక్కులు ఉంటాయని, సరైన కారణాలు లేకుండా వారిని తిరిగి అరెస్ట్ చేయడం చెల్లదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.


More Telugu News