Australia student visa: భారత్ నుంచి వచ్చే విద్యార్థులపై నిఘా: వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా

Australia Tightens Visa Rules for Indian Students Due to Fraud
  • భారత్‌ను అత్యంత రిస్క్ ఉండే దేశాల జాబితాలోకి చేర్చిన ఆస్ట్రేలియా
  • కేరళలో వెలుగు చూసిన 10 లక్షల ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్ నేపథ్యంలోనే నిర్ణయం
  • ఇకపై బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇంగ్లిష్ ప్రావీణ్యత పత్రాలు క్షుణ్ణంగా తనిఖీ
ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై వీసా రావడం అంత సులభం కాదు. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ను 'హై-రిస్క్' (అసెస్‌మెంట్ లెవల్ 3 - AL3) కేటగిరీలోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు లెవల్ 2లో ఉన్న భారత్‌ను, రిస్క్ ఎక్కువగా ఉండే పాకిస్థాన్ వంటి దేశాల జాబితాలోకి చేర్చడం గమనార్హం. జనవరి 8, 2026 నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.

ఇటీవల భారతదేశంలో, ముఖ్యంగా కేరళలో వెలుగుచూసిన భారీ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మందికి 22 యూనివర్సిటీల పేరుతో నకిలీ పత్రాలు సరఫరా అయినట్లు నివేదికలు వచ్చాయి. ఆస్ట్రేలియాలో ఇప్పటికే వేల సంఖ్యలో విద్యార్థులు కొనుగోలు చేసిన డిగ్రీలతో ఉన్నారని ఆ దేశ సెనేటర్ మాల్కం రాబర్ట్స్ ఆరోపించారు. ఈ 'ఇంటిగ్రిటీ' సమస్యల వల్లే నిఘా పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.

కొత్త నిబంధనల ప్రకారం, దరఖాస్తుదారులు కేవలం పత్రాలను సమర్పిస్తే సరిపోదు. అధికారులు ఆ పత్రాల వెనకున్న నిజాన్ని తనిఖీ చేస్తారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లను నేరుగా సదరు బ్యాంకులతో సంప్రదించి ధ్రువీకరించుకుంటారు. గతంలో చదివిన విద్యాసంస్థలకు ఫోన్ చేసి మార్కుల జాబితాలను క్రాస్ చెక్ చేస్తారు. అలాగే, ఇంగ్లిష్ భాషా నైపుణ్యానికి సంబంధించి మరిన్ని పక్కా ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

దక్షిణాసియా దేశాలపై ప్రభావం కేవలం భారత్ మాత్రమే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలను కూడా ప్రభుత్వం AL3 కేటగిరీలోకి మార్చింది. ఆస్ట్రేలియాలో ఉన్న మొత్తం 6.5 లక్షల మంది విదేశీ విద్యార్థులలో భారతీయులే 1.4 లక్షల మంది ఉన్నారు. అమెరికా, బ్రిటన్, కెనడాతో పోలిస్తే తమ దేశమే ఇప్పటికీ విద్యార్థులకు మెరుగైన ఎంపికని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జూలియన్ హిల్ సమర్థించుకున్నారు. అయితే, ఈ మార్పులు తాత్కాలికమా లేక దీర్ఘకాలికంగా కొనసాగుతాయా అన్నది వేచి చూడాలి.
Australia student visa
Indian students
Australian visa rules
fake certificates Kerala
Julian Hill
Australia education
visa assessment level 3
migration Australia
study in Australia
international students

More Telugu News