Venkataiah Chowdary: తిరుమలలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్లు

Venkataiah Chowdary Announces QR Code Footwear Counters in Tirumala
  • తిరుమలలో పాదరక్షల నిర్వహణకు క్యూఆర్ కోడ్ విధానం ప్రారంభం
  • లగేజీ కౌంటర్ల తరహాలో 8 ప్రాంతాల్లో కొత్త కేంద్రాల ఏర్పాటు
  • క్యూఆర్ కోడ్ స్లిప్ ద్వారా వేగంగా పాదరక్షల గుర్తింపు
  • కోరమాండల్ ఇంటర్నేషనల్ సహకారంతో టీటీడీ అమలు
తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొండపై పాదరక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా, లగేజీ కౌంటర్ల తరహాలోనే ఆధునిక క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం వద్ద ఈ నూతన విధానాన్ని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి. వెంకయ్య చౌదరి మంగళవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదరక్షల నిర్వహణలో భక్తులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయగా, భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో ఇప్పుడు తిరుమలలోని 8 కీలక ప్రాంతాల్లో ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇలా పనిచేస్తుంది.. ఈ విధానంలో, భక్తులు తమ పాదరక్షలను కౌంటర్‌లో అప్పగించినప్పుడు, వారికి ఒక క్యూఆర్ కోడ్ ఉన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్‌లో పాదరక్షల సంఖ్య, సైజు, భద్రపరిచిన రాక్, బాక్స్ నంబర్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. భక్తులు తిరిగి వచ్చి స్లిప్‌ను స్కాన్ చేయగానే, వారి పాదరక్షలు ఎక్కడ ఉన్నాయో సిబ్బందికి వెంటనే తెలిసిపోతుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే వాటిని సులభంగా తిరిగి పొందవచ్చు.

గతంలో పాదరక్షలన్నీ ఒకేచోట కుప్పలుగా ఉండటంతో 70 నుంచి 80 శాతం మంది మాత్రమే వాటిని తీసుకెళ్లేవారని, కానీ ఈ కొత్త విధానంతో ఇప్పుడు దాదాపు 99 శాతం మంది తమ పాదరక్షలను తిరిగి సేకరిస్తున్నారని అదనపు ఈవో తెలిపారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన సీఎస్ఆర్ నిధులతో ఈ ప్రాజెక్టును పూర్తిగా అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. భక్తుల సౌకర్యం, తిరుమల పరిశుభ్రత పరంగా దేశంలోని ఆలయాల్లో ఇది ఒక ఉత్తమ విధానంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

తిరుమల పవిత్రతను కాపాడటంలో భాగంగా, భక్తులు తమ పాదరక్షలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా, కేవలం నిర్దేశిత కౌంటర్లలోనే జమ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె. సత్యనారాయణ, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
Venkataiah Chowdary
TTD
Tirumala
QR code
Footwear counters
Pilgrim management
Tadigonda Vengamamba
Koramandal International
Andhra Pradesh temples

More Telugu News