మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... మహిళలకు ఉచిత ప్రయాణం

ఈసారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 3,49 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం
ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారంలో జాతర
జాతరకు అవసరమైతే మరిన్ని బస్సులు నడిపే విధంగా కార్యాచరణ
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారంలో జాతర జరగనుంది. అవసరమైతే మరిన్ని బస్సులు నడిపేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనంగా వసూలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు ఛార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది.

గత జాతర సమయంలో ఆర్టీసీ 3,491 ప్రత్యేక బస్సులు నడిపినప్పటికీ, కీలక సమయాల్లో అవి సరిపోకపోవడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. 

ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.


More Telugu News