ఈ ఐదు అంశాల్లో ఫ్రాన్స్ కంటే భారతదేశమే బెటర్... ఇది ఓ ఫ్రెంచ్ అమ్మాయి మాట

  • ఫ్రాన్స్ కంటే ఇండియా ఐదు విషయాల్లో మేలంటూ ఫ్రెంచ్ యువతి పోస్ట్
  • భారతీయుల ఆతిథ్యం, స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి అద్భుతమన్న ప్రశంస
  • రంగురంగుల ఆభరణాలు, స్లీపర్ బస్సుల ప్రయాణం ప్రత్యేకమని కితాబు
  •  ముఖ్యంగా భారతీయుల శిరోజాలు అమేజింగ్ అంటూ వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల హర్షం
ఉద్యోగం కోసం ఫ్రాన్స్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ యువతి, ఇక్కడి జీవన విధానానికి, సంస్కృతికి ఫిదా అయింది. ఫ్రాన్స్‌తో పోలిస్తే భారత్‌ ఐదు విషయాల్లో ఎంతో గొప్పగా ఉందని చెబుతూ ఆమె చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రెల్‌డవే (Freldaway) అనే ఈ ఫ్రెంచ్ యువతి "ఫ్రాన్స్ కంటే ఇండియా మెరుగ్గా ఉన్న ఐదు అంశాలు" అనే శీర్షికతో పంచుకున్న ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకుంది.

ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్న ఐదు విషయాలు ఇవి:

1. ఆప్యాయత, ఆతిథ్యం: విదేశీయుల పట్ల భారతీయులు చూపే ఆప్యాయత, ఆతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె చెప్పింది. "ఇక్కడ నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తారు. ఫ్రాన్స్‌లో కూడా విదేశీయుల పట్ల ఇంతే దయ, ఓపెన్ హార్ట్‌తో ఉంటే బాగుండు" అని ఆమె అభిప్రాయపడింది.

2. స్ట్రీట్ ఫుడ్: ఇండియాలో ఎక్కడైనా తక్కువ ధరకే రుచికరమైన, వైవిధ్యమైన వీధి ఆహారం దొరుకుతుందని ప్రశంసించింది. ఆహారం తింటూ అక్కడి వారితో మాట్లాడటం, సామాజికంగా కలవడం ఎంతో ఆనందాన్నిస్తుందని పేర్కొంది.

3. ఆభరణాలు: ఇక్కడి రంగురంగుల ఆభరణాలు తనను కట్టిపడేశాయని చెప్పింది. ఝుమ్కాలు, గాజులు, నెక్లెస్‌లు వంటివి ఎంతో ఫ్యాషనబుల్‌గా, ఆకర్షణీయంగా ఉంటాయని, వాటిని చూస్తే చాలా ఇష్టమని "Obsessed" అంటూ రాసుకొచ్చింది.

4. స్లీపర్ బస్సులు: దేశంలో రవాణా వ్యవస్థ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా స్లీపర్ ఏసీ బస్సుల సౌకర్యం గొప్పదని తెలిపింది. సమయం ఉంటే విమానాలకు బదులు స్లీపర్ బస్సుల్లో ప్రయాణిస్తే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడవచ్చని సూచించింది. ఫ్రాన్స్‌లోని బస్సుల కంటే ఇక్కడి రాత్రి ప్రయాణ వ్యవస్థ మేలని పోల్చింది.

5. శిరోజాల జన్యువులు: చివరగా, భారతీయుల జుట్టు జన్యువులను (Hair Genetics) ఆమె ప్రత్యేకంగా ప్రశంసించింది. "ఇక్కడి వారు సులభంగా షాంపూ యాడ్స్‌లో అవకాశం దక్కించుకోవచ్చు... వారి జుట్టు అంత పొడవుగా, ఆరోగ్యంగా ఉంది" అని సరదాగా వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ 2.7 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఆమె పరిశీలనను మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. "మా సంస్కృతిని చక్కగా గమనించారు", "మా దేశం గురించి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు" అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



More Telugu News