Ali Khan: పాకిస్థాన్‌లో పుట్టిన అమెరికా క్రికెటర్ కు భారత వీసా నిరాకరణ

Ali Khan Indian Visa Denied to Pakistan Born USA Cricketer
  • టీ20 వరల్డ్ కప్ ముందు అమెరికా జట్టుకు ఎదురుదెబ్బ
  • పాకిస్థాన్‌లో జన్మించిన పేసర్ అలీ ఖాన్‌కు వీసా నిరాకరణ
  • ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విషయాన్ని వెల్లడించిన అలీ ఖాన్
  • భారత్‌లో జరగనున్న మ్యాచ్‌లకు కీలక ఆటగాడు దూరం
  • మరికొందరు పాక్ మూలాలున్న ఆటగాళ్లకు కూడా వీసా సమస్యలు
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు ముందు మరో వివాదం తెరపైకి వచ్చింది. అమెరికా జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్‌కు భారత వీసాను నిరాకరించారు. ఈ విషయాన్ని అలీ ఖాన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

‘ఇండియన్ వీసా నిరాకరించబడింది’ అంటూ అలీ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. పాకిస్థాన్‌లోని అటక్ ప్రాంతంలో జన్మించిన అలీ ఖాన్, 19 ఏళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లాడు. అప్పటి నుంచి అమెరికా జాతీయ జట్టుకు రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై ఆడి రిషభ్ పంత్ వికెట్ తీసిన అనుభవం అలీ ఖాన్‌కు ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికా జట్టు గ్రూప్ ఏలో ఉంది. భారత్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌తోనే అమెరికా తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. జట్టు తమ నాలుగు గ్రూప్ మ్యాచ్‌లలో మూడింటిని భారత్‌లోనే ఆడాల్సి ఉండటంతో, కీలక బౌలర్ అయిన అలీ ఖాన్ లేకపోవడం పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

అలీ ఖాన్‌తో పాటు పాకిస్థాన్ మూలాలున్న మరో ముగ్గురు అమెరికా ఆటగాళ్ల వీసాలను కూడా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, పాకిస్థాన్‌లో జన్మించడమే వీసా నిరాకరణకు కారణంగా తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా క్రికెట్ బోర్డు భారత అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ಆడేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో, ఈ వీసా వివాదం టోర్నమెంట్‌కు మరో తలనొప్పిగా మారింది.
Ali Khan
USA Cricket
T20 World Cup 2026
Indian Visa
Visa Rejection
Pakistan
Rishabh Pant
Wankhede Stadium
USA vs India

More Telugu News