KTR: మీడియాపై సిట్ వేశారు సరే... మీ నేతల స్కాంలపై ఎందుకు వేయలేదు?: కేటీఆర్

KTR Slams Telangana Govt Over SIT Probes on Media
  • సీఎం, మంత్రి, ఓ ఐఏఎస్ అధికారిణిపై పోస్టులు
  • విచారణకు సిట్ వేసిన తెలంగాణ సర్కారు
  • తీవ్రస్థాయిలో స్పందించిన కేటీఆర్
  • పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ఎత్తుగడలని విమర్శ
  • కాంగ్రెస్ నేతల అవినీతి, కబ్జాలపై విచారణ ఏదని సూటి ప్రశ్న
  • మీడియా సంస్థలపై దర్యాప్తు పేరుతో వేధించడం సరికాదని హెచ్చరిక
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం తరచూ కమిషన్‌లు, ప్రత్యేక దర్యాప్తు బృందాల (సిట్) పేరుతో 'అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు' ఆడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఒక మంత్రికి సంబంధించిన వార్తను ఉటంకించినందుకు మీడియా సంస్థలపై సిట్ వేయడాన్ని తప్పుబట్టిన కేటీఆర్, సొంత పార్టీ నేతలు చేసిన తీవ్రమైన ఆరోపణలపై మాత్రం ఎందుకు విచారణ జరపడం లేదని సూటిగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగాయని చెబుతున్న పలు ఘటనలను కేటీఆర్ తన ప్రకటనలో ఏకరవు పెట్టారు. "ఒక మంత్రి పీఏ, రేవంత్ సహచరుడు కలిసి పారిశ్రామికవేత్త తలకు తుపాకి పెట్టి రూ.300 కోట్లు డిమాండ్ చేస్తే దానిపై సిట్ లేదు. ములుగు జిల్లాలో మంత్రి పీఏ ఇసుక దందాలో కోట్లు దండుకుంటే చర్యలు లేవు. రెవెన్యూ మంత్రి కుమారుడు వందల కోట్ల భూకబ్జాకు పాల్పడితే, కేసు పెట్టిన పోలీస్ అధికారి బదిలీ అయ్యారు కానీ, కబ్జాపై విచారణ లేదు" అని కేటీఆర్ ఆరోపించారు.

అంతేకాకుండా, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఓ కాంట్రాక్టర్‌ను రూ.8 కోట్ల కోసం బెదిరించారని, కస్తూర్బా గాంధీ పాఠశాలల బంకర్ బెడ్స్ కొనుగోలులో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని, లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ వివాదం, చీప్ లిక్కర్ కంపెనీలకు అక్రమ అనుమతులు వంటి అనేక స్కామ్‌లపై ప్రభుత్వం ఎందుకు సిట్ వేయలేదని ఆయన నిలదీశారు. యూనివర్సిటీ భూముల అమ్మకంలో భారీ మోసం జరిగిందని సుప్రీంకోర్టు కమిటీయే తేల్చినా విచారణ జరపకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

"అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే ఓ టీవీ ఛానెల్ వేసిన వార్తను కేవలం ఉటంకించినందుకు అనేక ఛానెళ్లపై, డిజిటల్ మీడియాపై సిట్ ఏర్పాటు చేశారు. అసలు వార్త వేసిన వారిని వదిలేసి, ఈ కొత్త డ్రామా ఎవరిని కాపాడటానికి? ఎవరిని వేటాడటానికి?" అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రశ్నించే మీడియా గొంతుకలపై వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
KTR
KTR Telangana
Revanth Reddy
Telangana Congress
BRS
Telangana News
SIT Investigation
Corruption Allegations
Media Harassment
Telangana Politics

More Telugu News