Chandrababu Naidu: సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె నుంచి పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం
- నాలుగు రోజులు నారావారిపల్లెలోనే ముఖ్యమంత్రి బస
- నారా, నందమూరి కుటుంబాల కలయికతో నారావారిపల్లెలో సందడి
- కృష్ణా జలాలను కళ్యాణి డ్యామ్‌కు మళ్లించే పనులకు శంకుస్థాపన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండగను జరుపుకుంటున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన తన సొంతూరులోనే గడపనున్నారు. నారా, నందమూరి కుటుంబాల కలయికతో నారావారిపల్లెలో సందడి నెలకొంది. పండుగ వేడుకల్లో పాల్గొంటూనే ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ముఖ్యంగా తిరుమల-తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం దిశగా పెద్ద అడుగు వేశారు. రూ. 126 కోట్లతో హంద్రీ నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కృష్ణా జలాలను కళ్యాణి డ్యామ్‌కు మళ్లించే పనులకు మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో తాగునీటి సమస్య పూర్తిగా తీరుతుంది. మార్గంలోని కనితమధుగు, కొండారెడ్డికండ్రిగ, కేఆర్ కండ్రిగ, నాగపట్ల, మూలపల్లి వంటి ట్యాంకులకు నీరు సరఫరా అవుతుంది. సుమారు 1,150 ఎకరాలకు సాగునీరు కూడా లభిస్తుంది.
ఈ పనులకు కూడా శ్రీకారం
- స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (యువతకు ఇండస్ట్రీ-ఓరియెంటెడ్ ట్రైనింగ్ కోసం, రూ.1.4 కోట్లు).
- కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సంజీవని ప్రాజెక్టు).
- టాటా డీఐఎంసీ.
- ఇండోర్ సబ్‌స్టేషన్ (33/11 kV సెమీ-ఇండోర్).
- సీసీ రోడ్లు.
అలాగే రంగంపేట-భీమవరం నుంచి శ్రీ శేషాచల లింగేశ్వరాలయంకు వెళ్లే బీటీ రోడ్డు (రూ.70 లక్షలు)ను కూడా ప్రారంభించారు. ఈ రోడ్డు వల్ల ఆలయానికి వెళ్లే భక్తులకు రాకపోకలు చాలా సులభమవుతాయి.