TCS: అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్లో టీసీఎస్ లో భారీగా తగ్గిన ఉద్యోగుల సంఖ్య
- మూడో త్రైమాసికంలో 13.91 శాతం తగ్గిన టీసీఎస్ లాభాలు
- కొత్త కార్మిక చట్టాలు అమలు చేయడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అన్న యాజమాన్యం
- లాభాలపై ప్రభావం చూపిన సీఎస్‌సీతో లీగల్ వ్యవహారం
దేశంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఆర్థిక ఫలితాల్లో కాస్త డీలా పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం, అంటే అక్టోబరు నుంచి డిసెంబరు వరకు, కంపెనీ నికర లాభం రూ.10,657 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.12,075 కోట్ల లాభంతో పోలిస్తే ఇప్పుడు 13.91% తగ్గుముఖం పట్టింది. అయితే ఇది సాధారణ డౌన్‌ఫాల్ కాదని, కొత్త కార్మిక చట్టాలు అమలు చేయడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అని కంపెనీ చెబుతోంది.
ఈ త్రైమాసికంలో కొత్త లేబర్ కోడ్‌లను పాటించేందుకు టీసీఎస్ రూ.2,128 కోట్లు పక్కన పెట్టింది. అందులో గ్రాట్యుటీ కోసం రూ.1,800 కోట్లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం రూ.300 కోట్లు కేటాయించారు. ఈ ఖర్చులను కట్ చేసి చూస్తే, లాభం 8.5% పెరిగి రూ.13,438 కోట్లకు చేరి ఉండేది. ఈ సందర్భంగా, సీఎఫ్‌ఓ సమీర్ సక్సేరియా మాట్లాడుతూ, ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో మార్జిన్లపై 0.10 నుంచి 0.15% మేర ప్రభావం పడవచ్చని చెప్పారు. అంతేకాదు, 2025 జులైలో ప్రకటించిన పునర్నిర్మాణ ప్రోగ్రామ్ వల్ల కూడా కొన్ని అదనపు ఖర్చులు వచ్చాయని తెలిపారు.
ఇంకా ఒక పెద్ద సమస్య ఏమిటంటే, అమెరికాలో కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్‌సీ)తో ఎప్పటి నుంచో సాగుతున్న లీగల్ ఫైట్. ఆ వివాదంలో పరిహారం కింద రూ.1,010 కోట్లు చెల్లించాల్సి వచ్చింది, అది కూడా లాభాలపై భారం మోపింది.
ఇక ఉద్యోగుల విషయానికొస్తే, 2025 డిసెంబరు 31 నాటికి టీసీఎస్‌లో మొత్తం సిబ్బంది సంఖ్య 5,82,163కు తగ్గిపోయింది. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే, అక్టోబర్-డిసెంబర్ మూడు నెలల్లో 11,151 మంది తగ్గారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే 12 వేల మందిని లేఆఫ్ చేస్తామని టీసీఎస్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పునర్నిర్మాణ కార్యకలాపాల వల్ల 6,000 మంది మీదే ప్రభావం పడిందని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.