Raj Thackeray: హిందీని రుద్దాలని చూస్తే తరిమికొడతాం: ఉత్తరాది వలసదారులకు రాజ్ థాకరే వార్నింగ్

Raj Thackeray warns against imposing Hindi kicks out
  • యూపీ, బీహార్ వలసదారులపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే నిప్పులు
  • హిందీని తమపై రుద్దితే సహించబోమని హెచ్చరిక
  • మరాఠీ అస్తిత్వం కోసం రెండు దశాబ్దాల తర్వాత ఏకమైన థాకరే సోదరులు
“హిందీ మీ భాష కాదనే విషయాన్ని ఉత్తరప్రదేశ్, బీహార్ వలసదారులు గుర్తుంచుకోవాలి. నాకు భాషపై ద్వేషం లేదు కానీ, దానిని మాపై బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం తరిమికొడతాను (I'll kick you)” అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే హెచ్చరించారు. ముంబై మున్సిపల్ ఎన్నికల (BMC) ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత థాకరే సోదరులు (రాజ్, ఉద్ధవ్ థాకరే) ఒకే వేదికపైకి వచ్చి మరాఠీ అస్తిత్వ నినాదాన్ని వినిపించారు.

జనవరి 15న జరగనున్న ఎన్నికలను ‘మరాఠీ మనుషుల ఉనికి కోసం జరుగుతున్న చివరి పోరాటం’గా రాజ్ థాకరే అభివర్ణించారు. అన్ని వైపుల నుంచి జనం వచ్చి మహారాష్ట్ర ప్రయోజనాలను కొల్లగొడుతున్నారని, మన భాషను, భూమిని కాపాడుకోకపోతే మరాఠీ జాతి కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైని దక్కించుకోవడానికి ఎందరో ప్రాణత్యాగం చేశారని, వారి సాక్షిగా మరాఠీ ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

సభలో శివసేన (UBT) నేత ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. ముంబైకి పొంచి ఉన్న ముప్పును అడ్డుకోవడమే లక్ష్యంగా తాము చేతులు కలిపామన్నారు. బీజేపీ తన సాంస్కృతిక, ఆర్థిక ఎజెండాతో ముంబైని గుజరాత్‌లో కలిపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు నగరాన్ని ధారాదత్తం చేయడమే బీజేపీ అసలు ఉద్దేశమని, అందుకే హిందీని తప్పనిసరి చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. మరాఠీ అస్తిత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో తమతో కలిసి రావాలని థాకరే సోదరులు విజ్ఞప్తి చేశారు.
Raj Thackeray
Raj Thackeray Hindi
Maharashtra Navnirman Sena
MNS
Mumbai Municipal Elections
BMC Elections
Uddhav Thackeray
Marathi identity
Mumbai
North Indian migrants

More Telugu News