BV Raghavulu: జగన్ తీరు మారాలి: బీవీ రాఘవులు

BV Raghavulu Comments on Jagans Stance on Amaravati
  • అమరావతిపై వ్యాఖ్యలు, వివాదాలు అనవసరమన్న బీవీ రాఘవులు
  • రాష్ట్రం ఏర్పడి 15 ఏళ్లు గడుస్తున్నా ఇంకా రాజధానిపై చర్చలు సాగడం సరికాదని వ్యాఖ్య
  • జగన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలన్న రాఘవులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత బీవీ రాఘవులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై వ్యాఖ్యలు, వివాదాలు అనవసరమని ఆయన హితవు పలికారు. రాష్ట్రం ఏర్పడి 15 ఏళ్లు గడుస్తున్నా ఇంకా రాజధానిపై చర్చలు సాగడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

అమరావతిని రాజధానిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఇప్పటికే అంగీకరించారని, ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం సరికాదన్నారు. తొలుత జగన్ కూడా అమరావతినే రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. కృష్ణానది తీరంలో అమరావతి ఉందా లేదా అనే చర్చకు ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. రాజధాని నిర్మాణంలో లోపాలు లేదా అవినీతి ఉంటే వాటిని ప్రశ్నించాలని, కానీ రాజధానినే తిరస్కరించేలా మాట్లాడటం తగదని రాఘవులు వ్యాఖ్యానించారు. అమరావతిని అంగీకరించి, దాని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా సహకరించాలని రాఘవులు సూచించారు.

ఇదిలా ఉండగా, రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు అంశాలపై చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేస్తున్న విమర్శలపైనా రాఘవులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపాదించిన వెలిగొండ, హంద్రీ నీవా, గాలేరు వంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదని, అలాంటి పరిస్థితుల్లో లేని ప్రాజెక్టులపై అనవసర రాద్దాంతం చేయడం ద్వారా ప్రజలకు అన్యాయం చేయవద్దని హితవు పలికారు. పోలవరం పేరుతో వైఫల్యాలను ఎత్తిచూపడం సరికాదని జగన్‌కు బి.వి. రాఘవులు సూచించారు. 
BV Raghavulu
Amaravati
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
CPM
Capital city
Polavaram project
Rayalaseema Lift Irrigation Scheme
Chandrababu Naidu
Politics

More Telugu News