Harish Rao: మంత్రి కోమటిరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది: హరీశ్ రావు

Harish Rao Slams Telangana Government Over Movie Ticket Prices
  • రేవంత్ నడుపుతోంది సర్కారా? సర్కస్ కంపెనీనా? అంటూ హరీశ్ రావు ఫైర్  
  • కోమటిరెడ్డికి తెలియకుండానే సినిమా టికెట్ రేట్లపై జీవోలు వస్తున్నాయని విమర్శ
  • సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీని మరిచారని ఆరోపణ
  • టికెట్ల దందా వెనుక ఓ రాజ్యాంగేతర శక్తి ఉందని సంచలన వ్యాఖ్యలు
  • ఈ వ్యవహారంపై గవర్నర్ విచారణ జరపాలని డిమాండ్
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి నియంత్రణలో ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఒక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తికి తెలియకుండానే ఆ శాఖలో కీలక నిర్ణయాలు జరిగిపోవడం, జీవోలు విడుదల కావడం దారుణమని విమర్శించారు. 

సినిమా టికెట్ల రేట్ల పెంపు జీవో బయటకు వస్తే, ఆ శాఖ మంత్రి అయిన కోమటిరెడ్డి ‘నాకు తెలియదు, నా దగ్గరికి ఫైల్ రాలేదు’ అని నిస్సహాయత వ్యక్తం చేయడం ప్రభుత్వంలో పాలన ఏ స్థాయిలో ఉందో చెబుతోందన్నారు. "శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది అన్నట్లుగా ఉంది. పలు శాఖలకు తానే మంత్రినని చెప్పుకొనే కోమటిరెడ్డి, ఇప్పుడు తన శాఖలో ఏం జరుగుతుందో తనకు సంబంధం లేదనడం విడ్డూరం. టికెట్ల రేట్ల పెంపు సీఎం నిర్ణయమేనని ఆయన చెప్పకనే చెబుతున్నారు. అంటే, సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా లేనట్టా?" అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి గారు, మీరు నడుపుతోంది సర్కారా లేక సర్కస్ కంపెనీనా?" అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా తాను సీఎంగా ఉన్నంతకాలం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని, మరో సినిమాకు కూడా సిద్ధమవుతున్నారని ఆరోపించారు. సభను, ప్రజలను ఇంత నిస్సిగ్గుగా తప్పుదోవ పట్టించడం తగదన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం సినీ పరిశ్రమపై రాజకీయ కక్ష సాధిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. "పాలకుడు పాలసీతో ఉండాలి కానీ, పగతో ఉండకూడదు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్షగడతారు. మీ పేరు మరిచినందుకు మరో హీరోను జైలుకు పంపుతారు. ఇప్పుడు మీకు నచ్చిన వారికి రూ. 600 టికెట్ రేటుకు అనుమతి ఇస్తారా?" అని ప్రశ్నించారు. 

"గత పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ఠ. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమీషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం" అని అన్నారు.

సినిమా టికెట్ల రేట్ల కమీషన్ల దందాపై గవర్నర్ తక్షణమే దృష్టి సారించి, సమగ్ర విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్ రావు స్పష్టం చేశారు.
Harish Rao
Telangana
Komatireddy Venkat Reddy
Revanth Reddy
Movie Ticket Prices
Telangana Secretariat
Tollywood
KCR
Cinema Industry
Government Policies

More Telugu News