Lakshminarayana: ఔరా సైబర్ నేరగాళ్లు..! సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యకే కుచ్చుటోపీ!

Lakshminarayana Wife Duped in Cyber Fraud Stock Scam
  • సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ
  • స్టాక్ మార్కెట్ లాభాల ఆశచూపి రూ.2.58 కోట్లు స్వాహా
  • వాట్సాప్ గ్రూపులో చేర్చి, నకిలీ యాప్‌తో మోసగించిన కేటుగాళ్లు
  • మోసం కోసం భర్త బంగారాన్ని కూడా తాకట్టు పెట్టిన బాధితురాలు
  • ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
ఇటీవల ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారన్న వార్త వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ మాజీ ఐపీఎస్ అధికారి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అని, బాధితురాలు ఆయన భార్య ఊర్మిళ అని తెలియడంతో ఈ ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఆమె నుంచి సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.2.58 కోట్లు కాజేశారు.

వివరాల్లోకి వెళితే.. ఊర్మిళ వాట్సప్‌కు సైబర్ నేరగాళ్ల నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. అనంతరం ఆమెను 'స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20' అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఈ గ్రూప్‌లో దినేష్ సింగ్ అనే వ్యక్తి, తాను చెప్పినట్లు చేస్తే 500 శాతం లాభాలు ఖాయమని, కొన్ని స్క్రీన్‌షాట్లు పంపి నమ్మించాడు. అతనికి సహకరిస్తూ, అదే ముఠాకు చెందిన ప్రియసఖి అనే మహిళ తనకు కూడా లాభాలు వచ్చాయంటూ గ్రూప్‌లో పోస్టులు పెట్టింది.

వీరి మాయ మాటలు నమ్మిన ఊర్మిళ, యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'MCKIEY CM' అనే నకిలీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అనంతరం డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య కాలంలో పలు దఫాలుగా రూ.2.58 కోట్లను నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణకు చెందిన బంగారాన్ని కూడా ఆమె తాకట్టు పెట్టడం గమనార్హం. యాప్‌లో లాభాలు కనిపిస్తున్నా, డబ్బును వెనక్కి తీసుకునే (విత్‌డ్రా) ఆప్షన్ లేకపోవడంతో తాను మోసపోయానని ఆమె గ్రహించారు.

వెంటనే బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఊర్మిళ పంపిన డబ్బును సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఖాతాలను గుర్తించి, నిందితులను పట్టుకునే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.


Lakshminarayana
VV Lakshminarayana
Urmila
Cyber crime
Stock market scam
Online fraud
Cyber fraud
Visakhapatnam
IPS officer
Financial fraud

More Telugu News