Yanamala: రాజధానిపై జగన్ చేసిన కామెంట్లపై యనమల కౌంటర్

Yanamala Slams Jagan Confusion on Andhra Pradesh Capital
  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికే రాజధానిపై జగన్ కుట్రలు
  • అమరావతికి నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నమని మండిపాటు
  • అసంబద్ధ ప్రకటనలతో జగన్ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నాడని విమర్శలు
రాజ్యాంగంలో ‘క్యాపిటల్’ అనే పదమే లేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడం విడ్డూరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇది ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజధాని అంశంపై జగన్ గందరగోళంలో ఉన్నారని చెప్పారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరమన్న జగన్.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చారని గుర్తుచేశారు.

ఒకే అంశంపై మూడు వేర్వేరు సందర్భాల్లో మూడు వేర్వేరు మాటలు చెప్పారని యనమల ఆరోపించారు. అమరావతి నదీ తీరంలో ఉండకూడదని జగన్ అన్నారని గుర్తుచేస్తూ.. ప్రపంచంలోని అనేక జాతీయ రాజధానులు, ప్రధాన నగరాలు నదీ తీరాలపైనే అభివృద్ధి చెందాయనే విషయం జగన్ తెలుసుకోవాలన్నారు. నీటి వనరులు, వాణిజ్యం, రవాణా వంటి కీలక అవసరాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే రాజధానులు ఏర్పడ్డాయని యనమల చెప్పారు. డాన్యూబ్ నది తీరం వెంబడి నాలుగు దేశాల రాజధానులు (ఆస్ట్రియా, స్లోవేకియా, హంగేరీ, సెర్బియా) ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

నైల్ నదిపై కైరో, థేమ్స్‌పై లండన్, సైన్‌పై పారిస్, పోటోమాక్‌పై వాషింగ్టన్ డీసీ వంటి రాజధానులు ఉన్నాయని చెప్పారు. అయితే, జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేదేనని యనమల ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, నిధులు రాష్ట్రానికి రాకూడదన్నదే జగన్ లక్ష్యమని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి, సమగ్ర అభివృద్ధికి బలమైన ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని చెప్పారు. ఇది జగన్ కు ఇష్టం లేకపోవడం దురదృష్టకరమని యనమల విమర్శించారు.
Yanamala
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh
Amaravati
Yanamala Ramakrishnudu
TDP
Three Capitals
AP Capital
Political News
Andhra Politics

More Telugu News