సోమనాథుడికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. ఘనంగా 'శౌర్య యాత్ర'

  • సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు, అభిషేకం
  • 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో భాగంగా పర్యటన
  • శౌర్య యాత్రలో పాల్గొని డమరుకం వాయించిన ప్రధాని
  • ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు
  • రాజ్‌కోట్, గాంధీనగర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో భాగంగా ఆయన ఆలయానికి విచ్చేసి, సోమనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని స్వయంగా అభిషేకం, హారతి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు, పరిపాలన అధికారులతో ముచ్చటించారు.

అంతకుముందు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన 'శౌర్య యాత్ర'లో ప్రధాని పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో వీరుల గౌరవార్థం ఈ యాత్రను నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు. యాత్ర సాగుతున్న దారి పొడవునా ప్రజలు బారులు తీరి 'మోదీ-మోదీ' నినాదాలతో, పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. శివుడికి ప్రతీకగా భావించే డమరుకం శబ్దాలు మిన్నంటగా, ప్రధాని మోదీ కూడా ఉత్సాహంగా డమరుకాన్ని చేతుల్లోకి తీసుకుని వాయించారు.

ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. సోమనాథ్ పర్యటన అనంతరం ప్రధాని రాజ్‌కోట్, గాంధీనగర్‌లలో పర్యటించనున్నారు. రాజ్‌కోట్‌లో ట్రేడ్ షో, వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గాంధీనగర్‌లో అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2 మార్గాన్ని ఆయన ప్రారంభిస్తారు.


More Telugu News