యూట్యూబ్‌లో ఎడిటింగ్ నేర్చుకుని.. రూ. 11 కోట్లకు పైగా టర్నోవర్ సాధించిన యువకుడు!

  • ఎలాంటి అనుభవం లేకుండా యూట్యూబ్ చూసి ఎడిటింగ్ నేర్చుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తువాన్ లే
  • వరుసగా మూడేళ్ల పాటు అతి తక్కువ ఆదాయానికే పరిమితం
  • అయినా వేల సంఖ్యలో ఈమెయిల్స్ పంపి పట్టుదలతో నిలబడిన వైనం
  • మూడో ఏడాదిలో రూ. 10 లక్షల ఆదాయం నుంచి.. ఐదో ఏట రూ. 11.7 కోట్ల స్థాయికి వృద్ధి
ఓటమి అంచున నిలబడినా పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపించాడు కెనడియన్ ఎంటర్‌ప్రెన్యూర్ తువాన్ లే. రూపాయి పెట్టుబడి లేకుండా, కేవలం యూట్యూబ్‌లో వీడియో ఎడిటింగ్ నేర్చుకుని నేడు సుమారు రూ. 11 కోట్ల (1.4 మిలియన్ డాలర్లు) టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగాడు. ఎటువంటి ఫార్మల్ బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా స్థానిక వ్యాపారాలకు తక్కువ ధరకే సేవలు అందిస్తూ తన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నాడు.

తువాన్ లే ఆర్థిక ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా సాగింది. తొలి ఏడాది కేవలం 8,500 డాలర్ల ఆదాయంతో మొదలైన ఆయన ప్రయాణం, రెండో ఏడాదికి 17,400 డాలర్లకు చేరింది. అయితే, మూడో ఏడాదిలో కరోనా లాక్‌డౌన్ కారణంగా క్లయింట్లందరూ దూరం కావడంతో ఆదాయం 12,350 డాలర్లకు పడిపోయింది. ఆ క్లిష్ట సమయంలోనూ నిరాశ చెందకుండా, వచ్చిన కొద్దిపాటి సొమ్మును తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టి, వేల సంఖ్యలో క్లయింట్లకు 'కోల్డ్ ఈమెయిల్స్' పంపాడు. ఆయన పట్టుదలకు ఫలితంగా అదే ఏడాది చివరకు ఆదాయం ఏకంగా 1,10,000 డాలర్లకు చేరింది.

వ్యాపారం పుంజుకోవడంతో నాలుగో ఏడాదిలో తన మొదటి ఉద్యోగిని నియమించుకున్న తువాన్ లే ఆ ఏడాది 3,50,000 డాలర్ల టర్నోవర్ సాధించారు. ఐదో ఏడాది నాటికి తన కంపెనీని 15 మంది సభ్యుల బృందంగా విస్తరించి, ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. "వ్యాపారం చేయడం అనేది నా జీవితంలో నేను చేసిన అత్యంత కష్టమైన, అత్యంత సంతృప్తికరమైన పని" అని చెప్పుకొచ్చాడు. ఒకే రంగంలో ఏళ్ల తరబడి నిలకడగా శ్రమిస్తే అద్భుతాలు సాధించవచ్చని తువాన్ లే విజయం నిరూపిస్తోంది. 


More Telugu News